ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్​లోకి క్యాతనపల్లి మున్సిపల్ ​పాలక వర్గం

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​పార్టీకి గట్టి షాక్​తగిలింది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్​ చైర్​పర్సన్, వైస్ ​చైర్మన్​తో పాటు మరో ఐదుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే డాక్టర్ ​జి.వివేక్​వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్​పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​ఎర్రం సాగర్​రెడ్డి, కౌన్సిలర్లు కొక్కుల స్రవంతి, సత్యనారాయణ, పనాస రాజయ్య, మేకల తిరుమల, సుధాకర్​తో పాటు ఎర్రబెల్లి ప్రేమలత కాంగ్రెస్ లో చేరగా వారికి వివేక్​ వెంకటస్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్​ఎస్​ను వీడి గతంలోనే  కౌన్సిలర్ బింగి శివాని హస్తం గూటికి చేరగా, మరో మహిళా కౌన్సిలర్​ సైతం చేరనున్నట్లు తెలుస్తోంది. చైర్​పర్సన్, వైస్ ​చైర్మన్​పై అదే పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టడంతో వీరంతా కాంగ్రెస్​లో చేరారు. మున్సిపాలిటీలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో 9 మంది కాంగ్రెస్​పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయే ఛాన్స్ ఉంది. కౌన్సిలర్ల వెంట పలువురు కాంగ్రెస్​ లీడర్లు ఉన్నారు.