30 కోట్ల ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్ ఉన్న మొదటి మహిళ

సోషల్​మీడియాలో ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​ క్రేజ్​ నడుస్తోంది. అందుకే సెలబ్రిటీలు, సినిమా స్టార్స్​ ఇన్​స్టాలో రీల్స్​ చేస్తూ, స్టోరీలు పెడుతూ ఫ్యాన్స్​తో టచ్​లో ఉంటున్నారు. వాళ్లని ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. అయితే, ఈమెకు ఏకంగా ఇన్​స్టాగ్రామ్​లో 30 కోట్ల మంది ఫాలోయర్స్​ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఫాలోయర్స్​ ఉన్న  మొదటి మహిళగా రికార్డు క్రియేట్​ చేసింది అమెరికాకు చెందిన 24 ఏండ్ల కైలీ జెన్నర్​. 

రియాల్టీ టీవీ స్టార్, మోడల్ కూడా అయిన కైలీ ఈమధ్యే  సొంతంగా తన పేరుతో కాస్మొటిక్​ ప్రొడక్ట్స్ కంపెనీ నడుపుతోంది. ఆమెకు సోషల్​మీడియాలో ఫ్యాన్స్​తో టచ్​లో ఉండడమంటే ఇష్టం. అందుకే తన జీవితంలో ముఖ్యమైన విషయాల్ని, తన కంపెనీ ప్రొడక్ట్స్​ గురించి ఎప్పటికప్పుడు ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసుకుంటుంది కైలీ.  అయితే, గత కొన్ని నెలలుగా ఇన్​స్టాగ్రామ్​లో యాక్టివ్​గా లేకున్నా కూడా ఆమె  ఫాలోవర్స్​​ సంఖ్య 30 కోట్లకు చేరడం విశేషం. స్టార్​ ఫుట్​బాల్​ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో 38 కోట్లకు పైగా ఫాలోయర్స్​తో ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నాడు. ఇన్​స్టాలో రికార్డులు సాధించడం కైలీ​కి ఇదే మొదటిసారి కాదు. ఆమె తన కూతురు చేయిపట్టుకుని ఉన్న ఫొటో ఇన్​స్టాగ్రామ్​లో ఎక్కువ లైక్స్​ (18 కోట్లకు పైగా) వచ్చిన ఫొటోగా రికార్డులకెక్కింది. 

రియాల్టీ షోతో మొదలు

స్కూల్​ డేస్​ నుంచే ఆటపాటల్లో యాక్టివ్​గా ఉండేది కైలీ. పెద్దయ్యాక మోడల్​ అవ్వాలని కలలు కనేది. తన కలను నిజం చేసుకోవాలని 2007లో టీవీ నటిగా కెరీర్​ మొదలుపెట్టింది కైలీ. తన కజిన్స్​తో కలిసి ‘కీపింగ్​ అప్​ విత్​ ది కర్దషియాన్స్​’ అనే టీవీ రియాల్టీ షో సిరీస్​ లో యాక్ట్​ చేసింది. 2017లో ఫోర్బ్స్​ టాప్​ 100 లిస్టులో నిలిచిన చిన్నవయస్కురాలైన సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది కైలీ. ఇక్కడ మరో విషయం ఏమంటే... అమెరికన్​ నటి, ఫ్యాషనిస్ట్​ అయిన కిమ్​ కర్దషియాన్​, కైలీ వరుసకి అక్కాచెల్లెళ్లు.