- అందుకే సెకండ్ఫేజ్నిర్మాణం లేట్అవుతోంది
- ఇతర ప్రైవేట్సంస్థలు ముందుకు రావడం లేదు
- మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్మెట్రో రైలు ఫస్ట్ఫేజ్నిర్మాణం చేపట్టిన ఎల్అండ్ టీ సంస్థకు రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, యేటా దాదాపు రూ.1,300 కోట్లు నష్టపోతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంతోనే ఆ సంస్థ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి ముందుకు రాలేదని వెల్లడించారు. నష్టం భయంతో మరే ఇతర ప్రైవేటు సంస్థలు మెట్రో ఫేజ్–2 నిర్మాణానికి మొగ్గు చూపడం లేదన్నారు. సిటీలోని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ఆడిట్ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఎన్వీఎస్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మెట్రో ఫేజ్–2 నిర్మాణం చాలా సవాళ్లతో కూడుకున్నదన్నారు. బ్యాంకులు కూడా అప్పు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని చెప్పారు. అయితే ఫస్ట్ ఫేజ్లో ఆర్థికంగా, సామాజికంగా ఎదురైన అనేక సమస్యలను అధిగమించేలా సెకెండ్ ఫేజ్ ప్రతిపాదనలను రూపొందించామని వెల్లడించారు. ప్రజల సహకారంతో శరవేగంగా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం ముందుకు జాయింట్ వెంచర్ ప్రతిపాదన
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వమే మెట్రో రైలు నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని చూస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. జాయింట్ వెంచర్ విధానంలో మెట్రో ఫేజ్–2 చేపడితే బాగుంటుందని సూచించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఐదు కారిడార్లను చేపట్టబోతున్నాయని స్పష్టం చేశారు. 76 కిలోమీటర్ల మేర సెకండ్ఫేజ్నిర్మాణానికి రూ.24,269 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 30 శాతం రాష్ట్రం, 18 శాతం కేంద్రం.. మిగిలిన 48 శాతం జైకా లేదా ఇతర సంస్థల ద్వారా నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులను ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో భారత్ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, రాబోయే రెండు దశాబ్దాల్లో జపాన్, జర్మనీ అధిగమించి మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఆడిట్, అకౌంట్స్ శాఖ పాత్ర చాలా కీలకమన్నారు. రీజినల్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ సి.శైలజ, తెలంగాణ ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, డైరెక్టర్ జనరల్ అఫ్ ఆడిట్(సెంట్రల్) హేమ ముని వెంకటప్ప, అకౌంటెంట్ జనరల్ ఆడిట్ పి.మాధవి, ప్రిన్సిపాల్ డైరెక్టర్ అఫ్ కమర్షియల్ ఆడిట్ వీఎంవీ నావల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు