పార్లమెంటుకు చేరిన L2:ఎంపురాన్ వివాదం.. 17 సీన్ల డిలీట్ అంశంపై బీజేపీ ఎంపీ సురేష్ గోపీ క్లారిటీ

పార్లమెంటుకు చేరిన L2:ఎంపురాన్ వివాదం.. 17 సీన్ల డిలీట్ అంశంపై బీజేపీ ఎంపీ సురేష్ గోపీ క్లారిటీ

మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan) దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ రచ్చకు దారి తీసింది. గురువారం (2025 ఏప్రిల్ 3న) భారత పార్లమెంట్‌లో ఎల్2: ఎంపురాన్ పై చర్చ నడిచింది. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ ఈ మూవీ సెన్సార్ కత్తిరింపుల విషయంపై రాజ్యసభలో మాట్లాడారు.

"సెన్సార్ బోర్డు ఈ సినిమా నిర్మాతలపై ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని అన్నారు. అలాగే, ఎటువంటి రాజకీయ ఒత్తిడి కూడా లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా మొదట్లో వేసిన థ్యాంక్యూ కార్డుల, నా పేరును తొలగించమని నిర్మాతలకు ఫోన్ చేసి అడిగిన మొదటి వ్యక్తిని నేనే.. ఇదే నిజమని సురేష్ గోపి అన్నారు. ఒకవేళ నేను చెప్పే మాటల్లో అబద్దం ఉందని తేలితే, నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సినిమాలోని 17 సీన్లను డిలీట్ చేయాలన్నది కూడా ప్రొడ్యూసర్లు, లీడ్ యాక్టర్, డైరెక్టర్ నిర్ణయమని" సురేష్ గోపీ స్పష్టం చేశారు. 

అయితే, సురేష్ గోపీ వ్యాఖ్యల కంటే ముందుగా CPI MP జాన్ బ్రిట్టాస్ ఈ అంశంపై మాట్లాడారు. 'ఈ సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లను చూపించినందుకే రాజకీయ ఒత్తిడి పెట్టారని ఆయన ఆరోపించారు. సినిమా కటింగ్స్ కు వాక్ స్వేచ్ఛ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా విమర్శించారు జాన్. ఎగువ సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సినిమా చుట్టూ ఉన్న రాజకీయ అంశాలను ఎత్తి చూపారు. 

ఇదిలా ఉంటే.. అయితే ఇవేవీ ఎల్2: ఎంపురాన్ బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపలేదు. ఓ వైపు విమర్శలు, మరోవైపు కలెక్షన్లతో ఎంపురాన్ దూసుకెళ్తోంది. మార్చి 27న రిలీజైన ఈ మూవీ వారం రోజుల్లోనే.. ప్రపంచవ్యాప్తంగా రూ.239.7 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ మూవీ ఇండియాలో మొత్తంగా రూ.84.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

అయితే, మలయాళ ఇండస్ట్రీలో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన రెండో మూవీగా ఎల్2: ఎంపురాన్ రికార్డ్ సొంతం చేసుకుంది. మొదట మంజుమ్మెల్ బాయ్స్ రూ.240.5 కోట్ల గ్రాస్ తో ముందంజలో ఉంది. ఇక ఈ వీకెండ్ లో మంజుమ్మెల్ బాయ్స్ వసూళ్లను ఎంపురాన్ అధిగమించే ఛాన్స్ ఉంది.