L2 Empuraan Producer: ఆరు గంటల పాటు L2:‘ఎంపురాన్‌’ నిర్మాతను విచారించిన ఈడీ

L2 Empuraan Producer: ఆరు గంటల పాటు L2:‘ఎంపురాన్‌’ నిర్మాతను విచారించిన ఈడీ

వివాదాస్పద మలయాళ చిత్రం L2: ఎంపురాన్ నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్‌ నగదు లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతని చిట్ ఫండ్ కంపెనీ శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ కో ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నేడు సోమవారం (ఏప్రిల్7న) ప్రశ్నించింది.

అతని చిట్ ఫండ్ కంపెనీ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA)"ఉల్లంఘన"కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం కొచ్చి కార్యాలయంలో ప్రశ్నించింది. 

గోపాలన్ యాజమాన్యంలోని చిట్ ఫండ్ కంపెనీ శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ కో ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో సోదాలు జరిపిన తర్వాత రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. కోజికోడ్ మరియు చెన్నైలోని తన సంస్థ కార్పొరేట్ కార్యాలయాలలో నిర్వహించిన వరుస సోదాల సందర్భంగా గోపాలన్‌ను గతంలో కూడా ప్రశ్నించినట్లు EDవర్గాలు తెలిపాయి.

కొచ్చి కార్యాలయంలో ED అధికారులు గోకులం గోపాలన్‌ ను ఆరు గంటల పాటు విచారించినట్లు సమాచారం. ED ప్రశ్నోత్తరాల తర్వాత, గోపాలన్‌ను బయటకు వెళ్ళడానికి అనుమతించారు.

ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు గోపాలన్ సమాధానమిస్తూ.. "వారికి కొన్ని సందేహాలు ఉన్నాయి, కాబట్టి వారు ప్రశ్నలు అడిగారు. వారికి అలా చేసే అధికారం ఉంది. అడిగిన ప్రతి ప్రశ్నకు నేను స్పందించాను. అది నా బాధ్యత" అని గోపాలన్ మీడియాతో అన్నారు. అయితే, ప్రశ్నోత్తరాల నిర్దిష్ట అంశాన్ని ఆయన పూర్తిగా వెల్లడించలేదు.

L2: ఎంపురాన్: 

మోహన్ లాల్ నటించిన ఎల్2: ఎంపురాన్ కు ఓ వైపు విమర్శలు, మరోవైపు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మార్చి 27న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ మూవీ ఇండియాలో మొత్తంగా 11 రోజుల్లో రూ.90కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించింది.అయితే, మలయాళ ఇండస్ట్రీలో మొదటి రికార్డ్ మూవీగా నిలిచింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి 17 సీన్లను డిలీట్ చేయాలన్నది తెలిసిందే.