97వ ఆస్కార్ 2025 అవార్డుల కోసం ఎంట్రీలు మొదలయ్యాయి. ఇండియా నుంచి లాపతా లేడీస్ మూవీ అర్హత సాధించింది. ఇండియన్ మూవీస్ నుంచి అధికారికంగా ఎంపిక అయినట్లు.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. 2024, సెప్టెంబర్ 23వ తేదీ ప్రకటించింది. లాపతా లేడీస్ మూవీని అమీర్ ఖాన్, కిరణ్ రావు సంయుక్తంగా నిర్మించారు.
అసోం దర్శకుడు జాహ్నూ బారువా ఆధ్వర్యంలోని 13 మంది సభ్యుల కమిటీ.. లాపతా లేడీస్ చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు పంపించింది. లాపతా లేడీస్ మూవీతోపాటు తమిళ మూవీ మహారాజా, తెలుగు కల్కీ, హనుమాన్, హిందీ మూవీ వీర్ సావర్కర్, ఆర్టికల్ 370 వంటి సినిమాలను కూడా పరిశీలించింది కమిటీ.
చివరకు లాపతా లేడీస్ మూవీని ఇండియా నుంచి అధికారికంగా ఎంపిక చేసింది కమిటీ. బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ కేటగిరీ కింద ఈ సినిమాను ఆస్కార్ అవార్డ్ కోసం పంపిస్తున్నారు.
లాపతా లేడీస్ మూవీ ఏంటంటే?
లాపతా లేడీస్ ఓ సెటైరికల్ కామెడీ మూవీ. ఈ ఏడాది 2024 మార్చి 1న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. అయితే ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ..గత ఇండియన్ సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది.
అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీగా నెట్‌ఫ్లిక్స్ లో చరిత్ర సృష్టించింది. యానిమల్ లాంటి కమర్షియల్ సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.అంతేకాదు భారత దేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం ప్రదర్శించిన మూవీగా నిలిచింది.
సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు సందర్భంగా ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు.
లాపతా లేడీస్ కథ:
2001 సంవత్సరం బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. సమాజంలో కట్టుబాట్లు, ఆచారాలు, కుటుంబ గౌరవం పేర్లతో అమ్మాయిల ఆకాంక్షలు, లక్ష్యాలు, సంతోషాలు ఎలా అణచివేతకు గురవుతున్నాయో ఈ మూవీలో దర్శకురాలు కిరణ్ రావ్ కళ్ళకు కట్టినట్లుగా తెరకెక్కించారు.
పెళ్లి చేసుకొని అత్తవారింట్లో సేవలు చేసేందుకు అమ్మాయిలు ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు కుటుంబ సభ్యులు ఎలా ఆలోచిస్తారోననే అంశాన్ని కూడా బలంగా తెరకెక్కించారు. లాపతా లేడీస్ సినిమా ఎక్కువగా సరదాగానే సాగుతుంది. అయితే, చివరి 20 నిమిషాలు ఈ మూవీకి మరింత బలాన్ని తెచ్చిపెడతాయి. ఎమోషనల్‍గా సాగుతుంది. మనసుకు తాకేలా సీన్లు ఉంటాయి.
ఈ సినిమా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. లోతైన విషయాలను ఎంటర్‌టైనింగ్‍గా తెరకెక్కించడంతో ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా ఉంది. ఇప్పటి వరకూ చూడకపోతే వెంటనే ఈ సినిమాను చూసేయండి.