జగిత్యాల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ల్యాబ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది దందా

జగిత్యాల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ల్యాబ్‌‌‌‌‌‌‌‌  సిబ్బంది దందా
  • కెమికల్స్ లేవంటూ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లకు టెస్ట్‌‌‌‌‌‌‌‌లు
  • ఇక్కడి టీ హబ్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లో 60 రకాల టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేసే అవకాశం 
  •  టీహబ్‌‌‌‌‌‌‌‌కు పంపకుండా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌కు పంపుతున్నరు
  •  రోగుల నుంచి రెండింతలు వసూల్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రైవేట్‌‌‌‌‌‌‌‌గా చేయిస్తున్న వైనం

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలు కడుపు నొప్పితో ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేరింది. పరీక్షించిన డాక్టర్ సీరమ్ లిక్విడ్ ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ చేయించాలని సూచించారు. శాంపిల్ సేకరించిన సిబ్బంది ఇక్కడ టెస్టులు నిర్వహించడం లేదని, రూ.800 ఇస్తే ప్రైవేట్‌‌‌‌‌‌‌‌లో చేయిస్తామని చెప్పాడు. చేసేదేమీ లేక ల్యాబ్ సిబ్బంది అడిగిన డబ్బు ఇవ్వడంతో రెండు రోజులకు రిపోర్టు ఇచ్చారు. ఈ టెస్ట్‌‌‌‌‌‌‌‌కు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌లో రూ. 300 నుంచి 400 ధర ఉండగా రెండింతలు వసూల్ చేయడం గమనార్హం.’

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ల్యాబ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది కొత్త దందాకు తెరలేపారు. వివిధ అనారోగ్య సమస్యలపై హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వచ్చే రోగులకు డాక్టర్లు సూచించిన టెస్టులు సర్కార్ ఆస్పత్రిలో చేయకుండా, కెమికల్స్ లేవంటూ ప్రైవేట్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లకు పంపిస్తూ వసూళ్లకు తెర తీస్తున్నారు. టెస్టులు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ల్లో చేయిస్తామని చెప్పి రెండింతలు వసూల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ రోగులను దోచుకుంటున్నారు.  

టీహబ్‌‌‌‌‌‌‌‌కు పంపకుండా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌కు.. 

జగిత్యాల జిల్లా ఆస్పత్రితోపాటు అనుబంధంగా మెడికల్ కాలేజీ కూడా ఉండడంతో రోగులకు సేవలు పెరిగాయి. వీటికి అనుగుణంగా ప్రతిరోజు సీజన్ లో 500 నుంచి 600 మందికిపైగా ఔట్ పెషెంట్లు వస్తుండగా, మిగతా రోజుల్లో 300కు పైగా ఓపీ ఉంటుంది. నిత్యం దాదాపు 20 మంది వరకు ఇన్ పేషెంట్లు అడ్మిట్ అవుతుంటారు.  వీరి ఆరోగ్య స్థితిగతులపై అవసరం ఉన్న రోగులకు యూరిన్, బ్లడ్ టెస్టుల కోసం 200కు పైగా శాంపిల్స్ తీసి టెస్టులు చేస్తుంటారు. హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన టీ హబ్ ల్యాబ్ లో దాదాపు 64 రకాలకుపైగా టెస్టులు ఉచితంగా చేసే సౌకర్యం ఉంది. కానీ కాసులకు కక్కుర్తి పడిన ల్యాబ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది.. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ సిబ్బందితో కుమ్మక్కై శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను టీ హబ్ కు పంపకుండా బయటకు రిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ దందాలో రోగుల నుంచి రెండింతలు వసూలు చేయడం గమనార్హం. 

అరుదైన టెస్టులు  రిఫర్..?

ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్లకు సీబీపీ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయూఈ), కంప్లీట్ బ్లడ్ పిక్చర్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా, ఈఎస్ఆర్, ఇన్ పేషెంట్లకు సర్జికల్ ప్రొఫైల్, బ్లడ్ గ్రూపింగ్, సీబీపీ, సీటీబీటీ, హెచ్ఐవీ, హెచ్‌‌‌‌‌‌‌‌బీఎస్ఏజీ, హెచ్ఐవీ, మలేరియా, వీడీఆర్ఎల్, కిడ్నీ ఫంక్షన్, సీరమ్ క్రియాటినైన్, బ్లడ్ యూరియా వంటి టెస్టులు ఎక్కువగా అవసరమవుతాయి. వీటిలో థైరాయిడ్ ప్రొఫైల్, సీరమ్ ఎలక్ట్రోలైట్స్, సీరమ్ ఐరన్ లెవల్స్, బీ12,  యూరిన్ కల్చర్, పస్ కల్చర్, బ్లడ్ కల్చర్ వంటి టెస్టులు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌కు రిఫర్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీ హబ్ కు టెస్ట్ శాంపిల్స్ పంపాలని సూచిస్తున్నామని నిర్వాహకులు చెబుతుండగా, కెమికల్స్  లేవని చెబుతూ ల్యాబ్ సిబ్బంది బయటకు పంపుతున్నారు. 

ప్రైవేట్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లతో కుమ్మక్కు

జగిత్యాల సర్కార్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిగా అప్ గ్రేడ్ కావడంతో బస్ డిపో వద్ద మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్, టీ హబ్ కూడా ఏర్పాటు చేశారు. సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని ల్యాబ్ లో పని చేస్తున్న కొందరు సిబ్బంది సేకరించిన శాంపిల్స్‌‌‌‌‌‌‌‌ను టీ హబ్ కు పంపిచకుండా కొందరు డాక్టర్లు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు రిఫర్ చేసి రోగుల నుంచి వసూల్ చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు పదుల సంఖ్యలో శాంపిల్స్ రిఫర్ చేస్తూ రూ.వేలల్లో దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో గల్ఫ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే కార్మికులకు కూడా మెడికల్ టెస్టులు చేస్తూ వసూళ్లకు పాల్పడిన ఘటన బయటపడింది. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతోనే దందా కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. 

టెస్ట్‌‌‌‌‌‌‌‌లు రిఫర్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది

టీ హబ్‌‌‌‌‌‌‌‌లో కెమికల్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో లేదనుకుని ల్యాబ్ సిబ్బంది బయటకు రిఫర్ చేసినట్లు తెలిసింది.  టీహబ్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు మాత్రం టెస్టులు చేస్తున్నామని చెబుతున్నారు. ల్యాబ్‌‌‌‌‌‌‌‌, టీ హబ్‌‌‌‌‌‌‌‌ సిబ్బందిని సమన్వయం చేసుకుని అన్ని రకాల టెస్టులు చేస్తాం.

సుమన్ రావు, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌, జగిత్యాల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌