పోస్టులకు లేబుల్స్!

పోస్టులకు లేబుల్స్!

యూజర్లు పోస్ట్​ చేసే కంటెంట్​పై ఫేస్​బుక్​ కన్నేసింది. మనకు తెలియకుండానే మనం పెట్టిన పోస్టులు, ఫొటోలకు ‘లేబుల్​’ ఇస్తోంది. మనం పెట్టిన పోస్టులకు ‘సీక్రెట్​’ ఆప్షన్​ పెట్టినా డేటా మొత్తం తీసేసుకుంటోంది. ‘హైదరాబాద్​’ కేంద్రంగా దేశీయ ఐటీ దిగ్గజం విప్రోతో ఆ పని చేయిస్తోంది. గత ఏడాది ఏప్రిల్​లో ‘ప్రాజెక్ట్​ లేబుల్​’ను ప్రారంభించింది. 2014 నుంచి యూజర్లు పోస్టు చేసిన సమాచారాన్ని 260 మంది ఉద్యోగులు విశ్లేషించే పనిలో ఉన్నారు. ఫేస్​బుక్​ చెప్పినట్టు యూజర్లు పోస్ట్​ చేసిన ఐటెమ్స్​ను ‘ఐదు విభాగాలు’గా లేబుల్​ చేస్తున్నారు ఉద్యోగులు. ఫుడ్​, సెల్ఫీ, జంతువులు, పెట్టిన సందర్భం, ఆ పోస్టు పెట్టిన యూజర్​ మనోగతం (జోక్​ చేయడానికా లేదా స్ఫూర్తి నింపేందుకా..) ఇలా విభజిస్తున్నారు.

యూజర్లు పెడుతున్న పోస్టుల్లో ఎలాంటి మార్పులొస్తున్నాయో తెలుసుకునేందుకే ఈ లేబులింగ్​ ప్రాజెక్టును చేపట్టినట్టు ఫేస్​బుక్​ వివరించింది. కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని అంటోంది. ఈ వ్యవహారంపై విప్రో స్పందించలేదు. తనకు ఎదురైతున్న ప్రశ్నలను నేరుగా ఫేస్​బుక్​కే పంపించేస్తోంది. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 200 లేబులింగ్​ ప్రాజెక్టులను ఫేస్​బుక్​ చేపట్టింది. యూజర్ల పోస్టులను నిర్వచించేలా సాఫ్ట్​వేర్​కు ట్రైనింగ్​ ఇవ్వడం, ఇతర ఫీచర్లలో ఏఐ (కృత్రిమ మేధ) పనితనాన్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు చెబుతున్నారు. అయితే, మునుపెన్నడూ ఇలాంటి లేబులింగ్​ ప్రయత్నాలు జరగలేదని అంటున్నారు.

ప్రైవసీ హుళక్కేనా?
ఈ సరికొత్త లేబులింగ్​ ప్రాజెక్టు మరోసారి ప్రైవసీపై చర్చకు బాటలేసింది. ఇప్పటికే కేంబ్రిడ్జి అనలిటికా వ్యవహారంతో యూజర్ల డేటాను అమ్ముకుందన్న అపవాదు కంపెనీపై పడింది. ఇప్పుడు యూజర్ల అనుమతి లేకుండా వాళ్ల డేటాకే లేబులింగ్​ ఇవ్వడమంటే ప్రైవసీని కాలరాసినట్టేనని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. యూజర్ల పోస్టులతో పాటు వాటి కామెంట్లు, యూజర్​ నేమ్​తో సహా స్క్రీన్​ షాట్లను తీసినట్టు ఫేస్​బుక్​ ఒప్పుకుంది కూడా. అయితే, ప్రైవసీ విషయంలో మాత్రం వెనక్కు తగ్గబోమంటోంది. కొద్దిరోజుల క్రితమే ప్రైవసీకి సంబంధించి ‘ఆడిటింగ్​ సిస్టమ్​’ను ప్రారంభించినట్టు చెప్పింది. యూజర్ల అనుమతి లేకుండా ఇలా లేబులింగ్​ చేయడం మాత్రం ప్రైవసీకి నీళ్లు వదలడమేనని ఫేస్​బుక్​ మాజీ ప్రైవసీ మేనేజర్​ ఒకరు చెప్పారు.

ప్రైవేట్​ పోస్టులను వదలట్లేదు
అప్​లోడ్లు, స్టేటస్​ అప్​డేట్లు, షేర్డ్​ లింకులు, ఈవెంట్లు, స్టోరీలు, వీడియోలు, ఫొటోలు, వాళ్లు పోస్ట్​ చేసిన స్క్రీన్​షాట్లను రాండమ్​గా ఎంపిక చేసుకుని లేబుల్​ చేస్తున్నట్టు ఫేస్​బుక్​, విప్రో ప్రకటించాయి. ఒక్కో ఐటమ్​కు ఇచ్చిన లేబుల్​ కచ్చితత్వాన్ని చెక్​ చేసేందుకు ఇద్దరు ఉద్యోగులు దానిని క్రాస్​ చెక్​ చేస్తున్నట్టు వెల్లడించాయి. ఒక్కో ఉద్యోగి సగటున రోజూ 700 ఐటెంలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇంకో లేబులింగ్​ ప్రాజెక్టులో భాగంగా కాగ్నిజెంట్​కూ ఆ పని అప్పగించింది ఫేస్​బుక్​. అదీ హైదరాబాద్​లోనే జరుగుతోంది. 500 మంది పనిచేస్తున్నారు. సున్నితమైన అంశాలు, వీడియోల్లోని అభ్యంతరకర భాషలకు వారు లేబులింగ్​ ఇస్తున్నట్టు ఓ ఉద్యోగి చెప్పారు. యూజర్లు పెట్టిన ప్రైవేట్​ పోస్టులను ఫేస్​బుక్​ వదలట్లేదు. పబ్లిక్​ పోస్టులతో పాటు కొందరే ఆ పోస్టును చూసేలా పెట్టినా, ఆ డేటాను తీసుకుంటోంది.