అయిజ, వెలుగు: పట్టణ శివారులోని రైస్, జిన్నింగ్ మిల్లులపై కార్మిక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఓ జిన్నింగ్ మిల్లులో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అక్కడ పని చేస్తున్న ఓ బాలికను గుర్తించారు. బాలికను మహబూబ్ నగర్ బాలికల సంరక్షణ విభాగం ఆఫీసుకు తరలించినట్లు కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్, జిల్లా బాలల సంరక్షణ అధికారి లక్ష్మీదేవి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల కార్మికులతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ ఆఫీసర్ లక్ష్మి, పోలీస్ సిబ్బంది హనుమంతు, శివన్న పాల్గొన్నారు.