- కాంగ్రెస్ టికెట్ కోసం లీడర్ల మధ్య తీవ్ర పోటీ
- హైకమాండ్ ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ ప్రచారం
- పోటాపోటీ కార్యక్రమాలతో స్పీడ్ పెంచిన లీడర్లు
గోదావరిఖని, వెలుగు: రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు కార్మిక నేతలు పోటీపడుతున్నారు. తమకే టికెట్వస్తుందంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ఆశీస్సులు ఉన్నాయంటూ కొందరు, యూనియన్ కోటాలో అవకాశం వస్తుందని మరికొందరు పోటాపోటీ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. తనకే టికెట్వస్తుందన్న ధీమాతో డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రచారం చేస్తుండగా, ఆయనకు పోటీగా యూనియన్ కోటాలో ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ తిరుగుతున్నారు. అలాగే స్వతంత్ర యూనియన్ హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కాంగ్రెస్ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్, ఐఎన్‌టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్కర వేణుగోపాల్‌రావు కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు.
వాడవాడలా మక్కాన్ ప్రచారం...
కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. వాడవాడలా తిరుగుతూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న టైంలో రాజ్ ఠాకూర్ శాప్ చైర్మన్‌గా పనిచేశారు. రామగుండం నియోజకవర్గంలో 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 11 వేలు, 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 27 వేల ఓట్లు సాధించినప్పటికీ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. అయితే మూడోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజ్‌ఠాకూర్ శ్రమిస్తున్నారు. ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నియోజకవర్గంలోని కార్పొరేషన్, గ్రామాల్లో తిరుగుతున్నారు.
పోటీగా జనక్ ప్రసాద్
ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న బి.జనక్ ప్రసాద్ రామగుండం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంచుతూ బొగ్గు గనులపై, గ్రామాల్లో కూడా తిరుగుతున్నారు. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తనకు టికెట్వచ్చే అవకాశాలున్నాయంటూ ఆయన చెప్పుకుంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ నేతలకు దేశవ్యాప్తంగా పలుచోట్ల టిక్కెట్లు కేటాయించే అవకాశం ఉన్నందున ఆ కోటాలో తనకు టికెట్గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. దీంతో ఆయన యూనియన్ శ్రేణులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
హర్కర, రియాజ్ కూడా..
టీపీసీసీ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ రావు రామగుండం వాసి. ఆయన ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. హర్కరకు జాతీయ స్థాయి నాయకులతో సత్సంబంధాలున్నాయి.
ఈక్రమంలో రామగుండం కాంగ్రెస్ టికెట్ కోసం సీరియస్‌గానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీలో పనిచేస్తూ సింగరేణిలో హెచ్‌ఎంఎస్ కు జనరల్ సెక్రటరీగా ఉన్న రియాజ్ అహ్మద్ కూడా ఆశలు పెట్టుకున్నారు. జాతీయ స్థాయిలో హెచ్‌ఎంఎస్ కు వివిధ పరిశ్రమల్లో సభ్యత్వం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయని హైకమాండ్‌కు చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలతో ఆయన టచ్‌లో ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి దక్కుంతుందన్న ఉత్కంఠ నెలకొంది.