లండన్:బ్రిటన్ కొత్త ప్రధానిగా లేబర్ పార్టీ లీడర్ కీర్ స్టార్మర్ (61) నియమితులయ్యారు. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కీర్ ఆధ్వర్యంలోని లేబర్ పార్టీ భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించింది. ఈ ఎన్నికల్లో రిషి సునాక్ (44) ఆధ్వర్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం చవిచూసింది. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్) లో మొత్తం 650 ఎంపీ సీట్లు ఉండగా, గురువారం ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు పోలింగ్ జరిగింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.
అనంతరం కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం తెల్లవారుజాముకల్లా ప్రతిపక్ష లేబర్ పార్టీ విజయం ఖరారైపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావల్సిన కనీస మెజార్టీ(326)ని ఆ పార్టీ దాటిపోయింది. మొత్తంగా లేబర్ పార్టీ 409 ఎంపీ సీట్లను గెలుచుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 119 సీట్లకే పరిమితమైంది. పోయిన ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో ఏకంగా 250 ఎంపీ సీట్లను ఆ పార్టీ కోల్పోయింది. అయితే, నార్తర్న్ ఇంగ్లాండ్‌లోని రిచ్ మండ్ అండ్ నార్త్ అలర్టన్ సీటును రిషి సునాక్ కాపాడుకున్నారు. కీర్ స్టార్మర్ లండన్‌లోని తన సిట్టింగ్ స్థానం హోల్బర్న్ అండ్ సెయింట్ పాన్ క్రాస్‌లో మరోసారి గెలుపొందారు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ తోసహా కన్జర్వేటివ్ పార్టీ టాప్ లీడర్లు గ్రాంట్ షాప్స్, పెన్నీ మోర్డాంట్, జాకబ్ రీస్ మోగ్ వంటి హేమాహేమీలు సైతం ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
రిషి రాజీనామా.. కొత్త ప్రధానిగా కీర్..
ఎన్నికల్లో ఓటమి ఖరారైన తర్వాత రిషి సునాక్ తన అధికారిక నివాసం టెన్ డౌనింగ్ స్ట్రీట్ ముందు ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. ఆ తర్వాత భార్య అక్షతామూర్తితో కలిసి బకింగ్ హామ్ ప్యాలెస్‌కు వెళ్లి కింగ్ చార్లెస్-3కి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం కీర్ స్టార్మర్ తన భార్య విక్టోరియా స్టార్మర్తో కలిసి బకింగ్ హామ్ ప్యాలెస్‌కు వెళ్లి కింగ్ చార్లెస్-3ని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను రాజు ఆహ్వానించారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్ నియామకానికి ఆమోదం తెలిపారు. కాగా, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ తన కేబినెట్ మంత్రులను ప్రకటించారు. డిప్యూటీ పీఎంగా యాంజెలా రేనర్, ఆర్థిక మంత్రిగా లేబర్ పార్టీ సీనియర్ నేత రాచెల్ రీవ్స్(45)ను నియమిస్తున్నట్టు కీర్ స్టార్మర్ ప్రకటించారు. బ్రిటన్‌కు తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ నిలవనున్నారు.
గత పీఎంల తప్పిదాలకు బాధితుడైన రిషి..
బ్రిటన్ లో 14 ఏండ్లుగా అధికారంలో ఉన్న టోరీలు (కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు) తీసుకున్న నిర్ణయాలు, కుంభకోణాలు, ఇతరత్రా వివాదాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బ్రిటన్ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఘోరంగా తిరస్కరించారు. అయితే, కష్టకాలంలో రెండేండ్ల కిందట బ్రిటన్‌కు తొలి ఇండియన్ సంతతి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్ తన వంతుగా దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ రిషి కంటే ముందు పాలించిన టిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్ వంటి ప్రధానులు తీసుకున్న నిర్ణయాలతో పాటు రూలింగ్ పార్టీ సభ్యుల కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారని విశ్లేషకులు చెప్తున్నారు. ఫలితంగా గత ప్రధానులు చేసిన తప్పిదాలకు రిషి సునాక్ బాధితుడిగా మిగిలారని అంటున్నారు.
కాశ్మీర్‌పై లేబర్ పార్టీ వైఖరిని మార్చేసి..
గతంలో జమ్మూకాశ్మీర్ విషయంలో బ్రిటన్ ప్రభుత్వానికి విరుద్ధంగా ప్రకటనలు, తీర్మానాలు చేస్తూ లేబర్ పార్టీ తరచూ విమర్శలపాలు అవుతుండేది. 2019లో జెరెమి కోర్బిన్ నాయకత్వంలో ఆ పార్టీ ఏకంగా కాశ్మీర్‌లోకి ఇంటర్నేషనల్ అబ్జర్వర్లను పంపాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టిన కీర్ స్టార్మర్ మాత్రం కాశ్మీర్‌పై ఆ పార్టీ వైఖరిని మార్చేశారు. కాశ్మీర్ అంశం ఇండియా అంతర్గత వ్యవహారమని, దానిని పాక్, ఇండియా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. అలాగే, దీపావళి, హోలీ వంటి హిందూ పండగల సెలబ్రేషన్లలో పాల్గొంటూ హిందూఫోబియాను ఖండించారు. ఇలా లేబర్ పార్టీ వైఖరి మారడంతో ఆ పార్టీకి బ్రిటిష్ ఇండియన్ల మద్దతు కూడా గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. కాగా, కీర్ స్టార్మర్(61) ఆ దేశానికి గత 50 ఏండ్లలోనే ‘ఓల్డెస్ట్ పీఎం’గా నిలిచారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చిన స్టార్మర్..
9 ఏండ్లలోనే ప్రధాని పదవిని చేజిక్కించుకున్నారు.
ఇండియన్ల హవా.. 26 మంది గెలుపు
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థుల హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి మొత్తం 26 మంది ఇండియన్ ఆరిజిన్ నేతలు ఎంపీలుగా గెలిచారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ప్రీతి పటేల్, సుయె ల్లా బ్రవెర్మన్, క్లెయిర్ కౌటిన్హో కూడా విజయం సాధించారు. లీసెస్టర్ ఈస్ట్ నుంచి శివానీ రాజా (కన్జర్వేటివ్ పార్టీ) లండన్ మాజీ డిప్యూ టీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్ పార్టీ)పై గెలిచారు. లేబర్ పార్టీ నుంచి ప్రీత్ కౌర్ గిల్, టాన్ ధేసీ మరోసారి గెలవగా.. జస్ అథ్వాల్, కనిష్క నారాయణ్ వంటి వాళ్లు తొలిసారి ఎంపీలుగా ఎన్నికయ్యారు.
ఇద్దరు తెలంగాణ వాళ్లకు ఓటమి..
అంతర్జాతీయ వక్త, రచయిత ఉదయ్ నాగరాజు నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి పోటీ చేయగా.. 14,567 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. సిద్దిపేట జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు మాజీ ప్రధాని పీవీ బంధువు. లండన్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర కన్నెగంటి స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
నాదే బాధ్యత
‘‘ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచింది. కీర్ స్టార్మర్ కు అభినందనలు. కొత్త ప్రభుత్వా నికి శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేస్తాం. అన్ని రకాలు గా సహకరిస్తాం. ఇకపైనా ప్రజాసేవలో కొనసాగుతాం. ప్రజలు మా పార్టీకి బాధా కరమైన ఓటమిని ఇచ్చారు. ప్రజా తీర్పే అంతిమం. జనం కోపాన్ని, అసంతృప్తిని చూశా. దీనికంతటికీ నేనే బాధ్యత వహిస్తున్నా. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వాన్ని కూడా వదులు కుంటున్నా. పార్టీకి కొత్త లీడర్ వచ్చే వరకు ఆ బాధ్యతల్లో ఉంటా”
‑ రిషి సునాక్
కీర్‌కు కంగ్రాట్స్.. రిషికి ప్రశంసలు: మోదీ
బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపా రు. ‘‘యూకే, ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా మరింత సానుకూల, నిర్మాణాత్మక సహకారం అందుతుందని ఆశిస్తున్నా” అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన రిషి సునాక్‌ను మోదీ మరో ట్వీట్లో ప్రశంసించారు. బ్రిటన్‌కు అద్భుతంగా నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
మార్పు మొదలైంది
‘‘మార్పు ఇప్పుడు మొదలైంది. అది మంచిగా ఉంటుంది. నేను నిజాయతీగా ఉంటాను. ఎన్నికల్లో ఘన విజయంతో పాటే మనపై ఎంతో గొప్ప బాధ్యత ఏర్పడింది. దేశాన్ని ఒక్కటిగా నిలిపేందుకు మనం కృషి చేయాలి. దేశాన్ని పునరుద్ధరించాలి. మీరు ఎవరైనా కానీయండి. ఎక్కడి నుంచైనా రానీయండి. మీరు కష్టపడి పని చేస్తే.. రూల్స్ కు కట్టుబడి ఉంటే.. ఈ దేశం మీకు తగిన అవకాశం ఇస్తుంది. మీ కృషిని ఎల్లప్పుడూ దేశం గుర్తిస్తుంది. మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి”
‑ కీర్ స్టార్మర్