- వ్యవసాయ పనుల్లో లేబర్ కొరత
- ఎకరానికి రూ.5,500 నుంచి రూ.6 వేలు
- అన్ని పనులు వాళ్లే చేసుకుంటరు
యాదాద్రి, వెలుగు : వ్యవసాయ పనుల్లో లేబర్ కొరత వేధిస్తోంది. వరి నాట్లు వేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి యాద్రాద్రి జిల్లాకు కూలీలు వలస వస్తున్నారు. నాట్ల సీజన్వచ్చిందంటే పనులు చేయడానికి మహిళలు పోటీ పడి వచ్చేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పనికి రమ్మని పలుమార్లు పిలిచినా వచ్చేవారు కరువయ్యారు. రోజువారీ కూలి రూ.400 ఉండగా, ఇప్పుడు రూ.500 పైగా ఇవ్వాలని స్థానిక కూలీలు డిమాండ్చేస్తున్నారు.
దీంతో ఇతర రాష్ట్రాల కూలీల కోసం రైతులు చూస్తున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్న కొందరు మధ్యవర్తులు నాట్ల సీజన్ ప్రారంభానికి ముందే యూపీ, బెంగాల్, బిహార్రాష్ట్రాల నుంచి లేబర్లను రప్పిస్తున్నారు. కొందరిని నెల జీతానికి ఒప్పందాలు చేసుకోగా, మరికొందరిని రోజువారీగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
అకామిడేషన్తోపాటు భోజనం..
నాట్ల సీజన్ముగిసేంత వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు అకామిడేషన్తోపాటు భోజనం ఏర్పాట్లు కూడా కల్పిస్తున్నారు. వరి నాట్లు వేసేందుకు ఎకరానికి రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు స్థానిక రైతులతో మాట్లాడుకుంటున్నారు. ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు కమిషన్ తీసుకోవడంతోపాటు ఇతర ఖర్చులు కూడా తీసుకుంటున్నారు.
గుంపులో 10 మంది..
వలస కూలీలకు చెందిన ఒక్కో గుంపులో ఆడ, మగ కలిసి పది మంది వరకు ఉంటారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు నారు అందిస్తుండగా, మిగిలిన వారు నాట్లేస్తారు. ఉదయం 6 గంటలకే పొలంలోకి దిగిన వలస కూలీలు చీకటి పడే వరకు ఉంటూ రోజుకు రెండు ఎకరాల వరకు నాట్లేస్తున్నారు. స్థానిక కూలీలు రోజుకు ఒక ఎకరం మాత్రమే నాట్లేయగలుగుతున్నారు. పైగా నారు అందించే బాధ్యత రైతుల మీదే పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా రైతులే సమకూర్చాల్సి వస్తోంది. దీంతో స్థానిక కూలీలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని భావించిన రైతులు వలస కూలీలపై దృష్టి సారిస్తున్నారు.
లక్ష ఎకరాల్లో నాట్లు..
ఈ యాసంగి సీజన్లో యాదాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇప్పటివరకు లక్ష ఎకరాల్లో నాట్లు వేశారని చెబుతున్నారు. అయితే భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట, రాజాపేట, పోచంపల్లి సహా పలు మండలాల పరిధిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నాట్లు వేస్తున్నారు.