కోల్ వార్!​ .. బొగ్గు బ్లాకుల వేలంపై పోరుకు కార్మిక సంఘాలు రెడీ

కోల్ వార్!​ ..  బొగ్గు బ్లాకుల వేలంపై పోరుకు కార్మిక సంఘాలు రెడీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని కోల్​బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరుకు సింగరేణిలోని కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. బీఎంఎస్​ మినహా అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. శ్రావణపల్లి కోల్​ బ్లాక్​ను బేషరుతుగా సింగరేణికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలనే ప్రధాన డిమాండ్​తో దశలవారీ పోరాటాలకు యూనియన్లు రెడీ అయ్యాయి. గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్(ఏఐటీయూసీ), ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీతో పాటు సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఆర్టీయూ, ఇఫ్టూ, టీఎన్టీయూసీ, ఐఎఫ్​టీయూ ఈ నెల 5 నుంచి దశలవారీ ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నాయి. టీబీజీకేఎస్​ ఇప్పటికే కోల్​ బ్లాక్​ల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతోంది. మిగిలిన యూనియన్లతో కలిసి పోరాడేందుకు టీబీజీకేఎస్​ ముందుకు వచ్చింది. ఇదిలాఉంటే బీజేపీ అనుబంధ బీఎంఎస్​ ఈ పోరాటాలకు దూరంగా ఉంది. 

దశలవారీ ఆందోళనలు..

సింగరేణి ప్రాంతంలోని కోల్​ బ్లాక్​ల వేలాన్ని నిరసిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని కోల్​బెల్ట్​ ప్రాంతాలైన ఆరు జిల్లాల్లో దశలవారీ ఆందోళనలు చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ప్రస్తుతం వేలంలో ఉంచిన శ్రావణపల్లి కోల్​ బ్లాక్​ను సింగరేణికే అప్పగించాలని,  భవిష్యత్తులో సింగరేణి పరిధిలోని కోల్​ బ్లాక్​లను సింగరేణికే అప్పగించాలంటూ యూనియన్లు డిమాండ్​ చేస్తున్నాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాలన్నీ రెండు రోజుల కింద హైదరాబాద్​లో రౌండ్​ టేబుల్​ మీటింగ్​ పెట్టుకున్నాయి. దశల వారీ ఆందోళనలతో కేంద్రంతో పాటు రాష్ట్రానికి చెందిన బొగ్గు గనుల మంత్రి కిషన్​రెడ్డిపై ఒత్తిడి తీసుకురావడమే యూనియన్ల లక్ష్యంగా కనిపిస్తోంది. 

రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్​ల ప్రైవేటీకరణతో రాష్ట్రంతో పాటు సింగరేణికి నష్టం కలుగుతుందని వర్కర్స్​ యూనియన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్​కుమార్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనక్​ ప్రసాద్, ఎంప్లాయీస్​ యూనియన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు, హెచ్ఎఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియామ్​ అహ్మద్​తో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూస్​, ఇఫ్టూ, టీఎన్టీయూసీ, బీఆర్టీయూ సంఘాల నేతలు, లీడర్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్, టీబీజీకేఎస్​ యూనియన్లు ఇప్పటికే తమ కార్యాచరణను ప్రకటించి నిరసనలు ప్రారంభించాయి. బీఎంఎస్​ మినహా మిగిలిన సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తుండడంతో ఉమ్మడి ఎజెండాకు ప్రాధాన్యత ఇచ్చేలా యూనియన్ల లీడర్లు ముందుకెళ్తున్నారు.

ఆందోళనలు ఇలా..

  •     ఈ నెల 5న కోల్​బెల్ట్​ ప్రాంతాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు.
  •     10న సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల వద్ద నిరసనలు, కొత్తగూడెంలోని సింగరేణి హెడ్​ ఆఫీస్​ ఎదుట ధర్నా.
  •     13న సింగరేణి ఏరియాల్లో 13న జీఎం ఆఫీస్​ల ఎదుట ధర్నా.
  •     17న హైదరాబాద్​లోని సింగరేణి భవన్​ ఎదుట భారీ ధర్నా.
  •     కోల్​బెల్ట్​ పరిధిలోని జిల్లాల్లో కోల్​ బ్లాక్​ల వేలాన్ని నిరసిస్తూ సదస్సులు.
  •     సీఎం రేవంత్​రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డికి వినతిపత్రం ఇవ్వడంతో పాటు అవకాశాన్ని బట్టి ప్రధానికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం.