విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగశాల ఒక శక్తిమంతమైన అభ్యాసన వనరు. ఇది విజ్ఞానశాస్త్ర విద్యలో అంతర్భాగం. సైన్స్‌కు చెందిన వివిధ భావనలు అర్థం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవ విజ్ఞానాన్ని పొందగలుగుతారు. ప్రయోగశాలల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులలో పరిశీలన, వర్గీకరణ, విశ్లేషణ మొదలైన నైపుణ్యాలు పెంపొందించగలరు. విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా వివిధ విజ్ఞాన శాస్త్ర విషయాలపై కుతూహలం పెంచుకుని, వాటి గురించి తెలుసుకుని భవిష్యత్తుకు విజ్ఞానపరంగా బాటలు వేసుకుంటారు. శాస్త్రీయ దృక్పథాన్ని, పెంపొందించుకోవడమే కాకుండా వివిధ విషయాలను తెలుసుకోవడంలోనూ, సమస్య పరిష్కారం చేయడంలోనూ శాస్త్రీయ పద్ధతిని విద్యార్థులు వినియోగించుకోగలుగుతారు. అంతేకాక ప్రయోగశాలలో చేసే ప్రాక్టికల్స్ వల్ల విజ్ఞానాత్మక సామర్థ్యాలు, శాస్త్రీయ వైఖరులు, విజ్ఞానశాస్త్రం పట్ల అవగాహన పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది.
విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రయోగాలు
ప్రయోగశాలల్లో తరగతుల నిర్వహణ ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో అంత ఫలవంతంగా నిర్వహించడం లేదు. ఇది విద్యారంగంలో బహిరంగంగా మాట్లాడుకునే రహస్యం. సైన్స్ పాఠాలలో ఇచ్చిన ప్రయోగశాలల్లో విద్యార్థులు నిర్వహించే ప్రయోగాలను తప్పనిసరిగా పిల్లల భాగస్వామ్యంతో నిర్వహించాలి. కానీ, ఎంతవరకు కృత్యాలు నిర్వహిస్తున్నారనేది ప్రశ్నార్థకం. పాఠశాల స్థాయిలో కొందరు ఉపాధ్యాయులు మాత్రమే. ప్రయోగాలు విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించి మార్కులు ఇస్తున్నారు. కానీ, ఈ పరిస్థితి వేళ్లపై లెక్కపెట్టవచ్చు. దీనికిగల కారణం ఆర్థిక సమస్యల వల్ల ప్రయోగశాల వనరులను సమకూర్చుకోలేకపోతున్నాం అనేది పాఠశాల యాజమాన్యాల వాదన. ఒకవేళ ప్రయోగ పరికరాలు ఉన్నా ఉపాధ్యాయుల నిరాసక్తత వలన ప్రయోగ సామగ్రి ఒక గది మూలాన లేదా అల్మారాలో దుమ్ముపట్టి ఉండి నాపై ఉన్న దుమ్ము దులపండి అని ఎదురుచూస్తూ ఉంటాయి. అధికారులు పర్యవేక్షణకు వచ్చిన సమయంలో ప్రయోగశాలను ఉపయోగించే విధానం తెలిసినా ఉదాసీనత చూపిస్తున్నారనేది ఒక ఆక్షేపణ. ఇంటర్మీడియట్ స్థాయిలో చాలా కళాశాలల్లో ప్రయోగ తరగతులకు (జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) కేటాయించే పిరియడ్లు పేపరుపై మాత్రమే కనిపిస్తాయి.
ప్రాక్టికల్స్ మార్కులపై ఆరోపణలు
ప్రయోగశాల తరగతులు, వాటిపై నిర్వహించే వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్స్ మార్కులు వేసే విధానం గురించి ప్రతి సంవత్సరం ఆరోపణలు వస్తుంటాయి. వాటిపై సంబంధిత ప్రభుత్వ విభాగం తీసుకునే దిద్దుబాటు చర్యలు చీకటిలో వేసిన బాణాలులాగ ఉంటాయి అనేది మేధావుల విశ్లేషణ. ఇవి అన్నీ తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావంతులు వారి బాధ్యతను విస్మరించి మార్కులు వస్తే చాలు అనే ధోరణి భవిష్యత్తుకు అంత మంచిది కాదని గుర్తెరగాలి. .ప్రయోగశాల తరగతుల వలన విద్యార్థులకు ప్రయోగ, పరిశోధన నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీని ఫలితంగా భవిష్యత్తులో వచ్చే సమస్యలను సహకార ధోరణితో శాస్త్రీయ దృక్పథంతో పరిష్కరించుకుంటారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రయోగశాల నైపుణ్యాలు నేర్చుకుంటే తరువాత విద్యార్థులు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ కోర్సులలో సులువుగా ప్రయోగశాల విధానానికి అలవాటుపడతారు. కాబట్టి, ప్రయోగశాల తరగతుల నిర్వహణ, పరీక్షలు, మార్కులు ఇచ్చే విధానం పౌర సమాజ మన్ననలు పొందేలా ఉండాలి. అదేవిధంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు సహాయపడేలా ఉండాలని ఆకాంక్షిద్దాం. విద్యార్థుల భావోద్వేగాలను, అవగాహనను, ఆచరణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ప్రయోగశాలలు కీలకమైన పాత్ర పోషిస్తాయి అని కొఠారి కమిషన్ అభిప్రాయపడింది. కాబట్టి, కళాశాలలు, పాఠశాలలు పకడ్బందీగా ప్రయోగశాల తరగతులు నిర్వహించేలా ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా విద్యారంగం అడుగులు వేయాలని కోరుకుందాం.
- కమలహాసన్ తుమ్మ,
జీవశాస్త్ర నిపుణుడు