ఉపాధి హామీ పనుల్లో పనులకు రాకుండా డబ్బులు డ్రా.. సోషల్​ఆడిట్​లో కూలీల ఆరోపణ

  • అధికారులతో గొడవ

కౌడిపల్లి, వెలుగు: ఉపాధి హామీ పనుల్లో పనులు చేయకుండానే ఫీల్డ్ అసిస్టెంట్లు సంతకాలు పెట్టి డబ్బులు డ్రా చేసుకుంటున్నారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం15వ విడత సోషల్​ఆడిట్​కౌడిపల్లి మండల ప్రజా పరిషత్ ఆఫీసు వద్ద నిర్వహించారు. దీనికి డీఆర్డీఏ అడిషనల్ పీడీ రంగాచార్యులు హాజరయ్యారు. 2023 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 మార్చి31 వరకు జరిగిన  ఉపాధి హామీ పథకం పనుల వివరాలు వెల్లడించారు. మండలంలో ఉపాధి హామీ కింద 275 పనులు జరిగాయని, వాటికి  రూ. 5 కోట్ల 79 లక్షల 35, 596 ఖర్చు కాగా పంచాయతీరాజ్ లో జరిగిన 52 పనులకు  రూ.2 కోట్ల 68  లక్షల 47,582 ఖర్చు కాగా, అటవీ శాఖలో నాలుగు పనులకు రూ. 5 లక్షల31 వేల 38 రూపాయలు ఖర్చు కాగా మొత్తం రూ. 8 కోట్ల 53 లక్షల 14,216 నిధులు ఖర్చు అయ్యాయని అధికారులు తెలిపారు. వెల్మకన్న గ్రామానికి చెందిన టీఏ , ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించాలని కూలీలు డిమాండ్​ చేశారు.

ఉపాధి పనులకు రాకుండా ఇంటి దగ్గర ఉండి, పనులు చేస్తున్నట్టు సంతకాలు చేస్తూ డబ్బులు డ్రా చేసుకోవడం ఏంటని అధికారుల ముందే నిలదీశారు. కూలి పనులు చేసి సంవత్సరం గడుస్తున్న కొంతమందికి డబ్బులు చెల్లించలేదని పనులు చేయకుండా ఎక్కడో జాబ్ చేసుకుంటున్నా వారికి మాత్రం వెంటనే డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. ఒకరి పేరు మీద మరొకరు పనిచేయడం ఏంటని, ఒక్కరే ఇతర జాబ్ కార్డులపై 300 రోజులు పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఉపాధి పనులను  ఎంపీడీవో, ఏపీవో తనిఖీ చేయకనే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తప్పిదాలు బయటపడతాయని ఉద్దేశంతో సమాచారం ఇవ్వకుండానే సామాజిక తనిఖీ నిర్వహించారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందిస్తూ ఏపీవో, ఎంపీడీవో, ఈసీ, టీఏలు బాధ్యత వహించాలని హెచ్చరించారు.  కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి శ్రీహరి, స్టేట్ మానిటరింగ్ అధికారి దత్తు, ప్రోగ్రాం మేనేజర్ అశోక్, జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ అరుణ, సంతోష్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో పుణ్యదాస్, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.