
ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ముగిసి నాలుగు రోజులు కావొస్తున్నా.. దాయాది దేశ అభిమానులు, ఆటగాళ్లు, కోలు ఎవరూ ఆ గాయాలను మార్వలేకపోతున్నారు. అంతటి అవమానకర ఓటమి అది. దాయాదుల పోరులో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయిందన్న పేరు తప్ప.. మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఎక్కడా ఉత్కంఠ లేదు. పాక్ పైచేయి సాధించింది లేదు. దాంతో, ఆ జట్టుపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ప్రదర్శనపై ఆ జట్టు హెడ్ కోచ్ ఆకిబ్ జావేద్(Aaqib Javed) స్పందించారు. శవాలను పోస్ట్ మార్టం చేసినట్లు ఆయన ఒక్కో పాయింట్‌ను విడమరిచి చెప్పారు. ఆటగాళ్ల ఎంపికలో ఎక్కడా తప్పు దొర్లలేదని చెప్తూనే.. పేపర్‌పై దాయాది జట్టు భారత్ కంటే బలంగా ఉందని వెనకేసుకొచ్చాడు. అయితే ఆటగాళ్లలో అనుభవం లేకపోవడం పాకిస్థాన్‌ను దెబ్బతీసిందని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు.
"అన్ని మ్యాచ్‌ల్లా ఇండియా- పాకిస్తాన్ పోరు సాధారణ క్రికెట్ మ్యాచ్ కాదు, అంతకంటే ఎక్కువ. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు అటువంటివి. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని జయించాలంటే.. చాలా అనుభవం అవసరం. ఆ అనుభవం జట్టులో కొరవడింది.. "
"ప్రస్తుత భారత జట్టులో అందరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లే. అందరూ కలిసి దాదాపు 1500 మ్యాచ్‌లు ఆడారు. అన్ని దేశాల పిచ్‌లపై ఆడిన అనుభవం వారికుంది. ఈ విషయంలో పాక్ అట్టడుగున ఉంది. అందరూ కలిసి సరిగ్గా 400 మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ఒక్క బాబర్ ఆజంకు 100 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. తరువాత రిజ్వాన్ (88 వన్డేలు), షాహీన్ అఫ్రిది (64 వన్డేలు) కాస్త పర్లేదు. మిగిలిన వారు 30 కూడా ఆడలేదు. తయ్యబ్ తాహిర్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. ఇదే మమ్మల్ని దెబ్బ తీసింది. యువ ఆటగాళ్లు ఒత్తిడిని జయించలేకపోయారు. ఇటువంటి మ్యాచ్‌ల్లో నైపుణ్యం కంటే.. అనుభవం ఎక్కువ అవసరం.." అని ఆకిబ్ జావేద్ ఓటమిపై కొత్త వాదన మొదలు పెట్టారు.
ALSO READ : Champions Trophy 2025: ఇంటిదారి పట్టిన మూడు జట్లు.. ఓవరాక్షన్‌తో ఆ ముగ్గురు ట్రోలింగ్
చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు పోరాటం ముగిసింది. ఆడిన రెండింటిలో ఓడిన పాక్.. అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం(ఫిబ్రవరి 27) బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడుతోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే, ఆతిథ్య జట్టుకు పరువు కూడా దక్కదు.