కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో గైనకాలజిస్టుల కొరత

  • కామారెడ్డి దవాఖానాలో ఏడుగురికి ఉన్నది ముగ్గురే
  • ఇందులో ఒకరికి సూపరింటెండెంట్​ బాధ్యతలు
  • ప్రతీనెల 350కిపైగా డెలివరీలు   

కామారెడ్డి, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెలివరీలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, మాతాశిశు సంరక్షణకు ప్రయార్టీ ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా, సర్కారు దవాఖానాల్లో సరిపడా స్టాఫ్​ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కామారెడ్డి జిల్లా హాస్పిటల్​కు రోజూ వందలాది గర్భిణులు చెకప్​లు, డెలివరీల కోసం వస్తుంటారు. జిల్లా వారే కాకుండా బార్డర్​లో ఉన్న మెదక్, సిరిసిల్ల జిల్లాల నుంచి అనేక మంది ట్రీట్​మెంట్​కోసం ఇక్కడికి వస్తారు. ప్రతీ నెల హాస్పిటల్​లో 350 నుంచి 370కి పైగా డెలివరీలు జరుగుతాయి. 

ముగ్గురే గైనకాలజిస్టులు

కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో  గైనకాలజీ విభాగంలో ఏడుగురు డాక్టర్లు ఉండాలి. కానీ ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. వారిలో ఒకరు హాస్పిటల్​సూపరింటెండెంట్​గా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు డాక్టర్లు మాత్రమే గైనకాలజీ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు కూడా కాంట్రాక్ట్​ డాక్టర్లు. ఏడుగురిలో ఇద్దరు సివిల్​సర్జన్లు, ఒక డిప్యూటీ సివిల్​సర్జన్, ముగ్గురు  సివిల్​అసిస్టెంట్​సర్జన్లు,  డెలివరీలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా అడిషనల్ గా​మరో డాక్టర్​ను ( సిమాన్​ద్వారా) కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఒక సివిల్​సర్జన్​మాత్రమే రెగ్యులర్​డాక్టర్​ఉన్నారు. ఈయన కూడా సూపరింటెండెంట్​బాధ్యతలు చూస్తున్నారు. హాస్పిటల్​నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్​తో పాటు, జిల్లాలోని వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లను పర్యవేక్షణ చేయాలి. ఒక సివిల్​సర్జన్, ఒక డిప్యూటీ సివిల్​సర్జన్, ముగ్గురు సివిల్​అసిస్టెంట్​సర్జన్​పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   

పరిస్థితి ఇది..

హాస్పిటల్​లో వారంలో 3 రోజులు గర్భిణులకు స్పెషల్​చెకప్​లు చేస్తారు. దీంతో రోజుకు 200 నుంచి 300 మంది వరకు వస్తారు. ప్రతీరోజు 10 నుంచి 12కు పైగా డెలివరీలు ఉంటాయి. రెగ్యులర్​గా చెకప్​లకు వచ్చే గర్భిణులతో పాటు, డెలివరీలను ఇద్దరు గైనకాలజిస్టులే చూడాలి. ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు లేక రెగ్యులర్​చెకప్​కు వచ్చే వారికి సరైన వైద్యం అందడం లేదు. కొన్నిసార్లు సెకన్లలోనే చూసి పంపిస్తున్నారు. మరో వైపు నార్మల్ డెలివరీకి ప్రయార్టీ ఇవ్వాలని గవర్నమెంట్​చెబుతోంది. కొందరు గర్భిణులు అనారోగ్య సమస్యలతో ఉంటున్నారని, వీరికి నార్మల్​డెలివరీ చేయడం వీలుకాక సర్జరీ చేస్తున్నారు. రాత్రి వేళల్లో డెలివరీకి వస్తే ఇబ్బంది అవుతోంది. 

డ్యూటీలో ఉండే సిబ్బంది వీరిని జాయిన్​చేసుకొని ఉదయం డాక్టర్​వచ్చాక డెలివరీ చేస్తారని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే  డాక్టర్​ని  పిలిపించి డెలివరీ, సర్జరీ చేయిస్తున్నారు. వెంటనే  డెలివరీ చేయకపోవడంతో కొందరు రోగుల బంధువులు ఆందోళనలకు దిగుతున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేకపోవడం, ఉన్నవారిపై ఒత్తిడి పెరగడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. తమ సమస్యలు చెప్పుకోడానికి కూడా టైమ్​ఇవ్వడం లేదని రెగ్యులర్​చెకప్​లకు వచ్చిన గర్భిణులు వాపోతున్నారు.