‘ప్లాన్‌‌’ లేకుండా పనులు

  • ఓరుగల్లులో 53 ఏండ్ల కింది మాస్టర్‌‌ప్లానే అమలు చేస్తున్న ఆఫీసర్లు
  • ప్రకటనలు, హామీలకే పరిమితమైన గత బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌
  • ప్రపోజల్స్‌‌ పంపినా పక్కన పెట్టేసిన అప్పటి సీఎం కేసీఆర్‌‌
  • ప్లాన్‌‌ను మారుస్తామని జనవరిలో ప్రకటించిన ఇన్‌‌చార్జి మంత్రి పొంగులేటి
  • మాస్టర్‌‌ ప్లాన్‌‌ లేకుండా పనులు చేస్తే భవిష్యత్‌‌లో ఇబ్బందులు తప్పవంటున్న ప్రజలు

వరంగల్, వెలుగు : రాష్ట్రానికి రెండో రాజధానిగా పేరుగాంచిన ఓరుగల్లులో అభివృద్ధి పనులు కనీస ప్లాన్‌‌ లేకుండా, అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి. ఏదైనా పట్టణం అభివృద్ధి చెందాలంటే మాస్టర్‌‌ ప్లాన్‌‌ ఎంతో కీలకం. అందుకు తగ్గట్లుగా ప్లాన్‌‌ను రూపొందిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ వరంగల్‌‌ నగరంలో మాత్రం 53 ఏండ్ల కింద రూపొందించిన మాస్టర్‌‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది.

కొత్త మాస్టర్‌‌ ప్లాన్‌‌ రూపొందిస్తామని, అభివృద్ధి పనులు చేస్తామని బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. తీరా అన్ని ప్రపోజల్స్‌‌ రెడీ చేసి సీఎం వద్దకు ఫైల్‌‌ పంపితే దాన్ని ఆమోదించకుండా ఏండ్ల తరబడి పక్కన పెట్టేశారు. దీంతో స్మార్ట్‌‌ సిటీతో పాటు, వేలాది కోట్ల అభివృద్ధి పనులు పద్ధతి లేకుండా జరుగుతున్నాయి. 

ఇప్పటికీ 1971 మాస్టర్ ప్లానే...

గ్రేటర్‌‌ వరంగల్‌‌ సిటీలో  వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు 1971లో అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మాస్టర్‌‌ ప్లాన్‌‌ రూపొందించారు. తర్వాత 20 ఏండ్ల అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని 1972లో ప్లాన్‌‌ను సవరించారు. ఈ లెక్కన 1991లో కొత్త మాస్టర్‌‌ ప్లాన్‌‌ను తయారు చేయాల్సి ఉంది. కానీ 53 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కొత్త ప్లాన్‌‌ అమలుకు నోచుకోలేదు. గ్రేటర్‌‌ వరంగల్‌‌ చుట్టూ 40 ఏండ్లలో జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాకతీయ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అథారిటీ (కుడా) పరిధిలో 2013లో కొత్త ప్లాన్‌‌ను రూపొందించారు.

ఆ ప్లాన్‌‌కు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో  బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం పలు మార్పులు, చేర్పులు చేసింది. 2016లో వరంగల్‌‌ స్మార్ట్‌‌ సిటీ, హృదయ్, అమృత్‌‌ పథకాలకు ఎంపిక కావడంతో ‘లీ అసోసియేట్స్, కుడా ప్లానింగ్‌‌ విభాగం’ ఆధ్వర్యంలో మరోసారి మార్పులు చేశారు. 1,805 చదరపు కిలోమీటర్ల పరిధిలో కుడా ఉన్నందున డెవలప్‌‌మెంట్‌‌ కోసం జోన్లుగా విభజించారు. మూడు జిల్లాల పరిధిలోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు, 13 లక్షల జనాభా ఉన్నందున 2041 వరకు జనాభా 30 లక్షల నుంచి 33 లక్షలకు పెరుగుతుందని భావించి ప్లాన్‌‌ రూపొందించారు. కానీ ఆ ప్లాన్‌‌ ఇప్పటివరకు అమల్లోకి రాలేదు.

ప్లాన్‌‌ ఫైల్‌‌ నెలల తరబడి సీఎం టేబుల్‌‌ పైనే...

బీఆర్‍ఎస్‍ 2018లో రెండో సారి అధికారంలోకి వచ్చాక ‘మాస్టర్‌‌ ప్లాన్‌‌ 2041’ ఫైల్ ఓకే అయినట్లు చెప్పారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో రెండు మూడు సార్లు మీటింగ్‌‌ పెట్టి చర్చలు జరిపారు. కొన్ని మార్పుల అనంతరం ప్లాన్‌‌కు 2020 మార్చి 11న మంత్రి కేటీఆర్ సైతం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చారు.

తర్వాత ప్రభుత్వ ఆమోదం కోసం ఫైల్‌‌ను 2020 మార్చిలో సీఎం కేసీఆర్‌‌ ఆఫీస్‌‌కు పంపించారు. 2021లో జరిగిన గ్రేటర్‌‌ వరంగల్‌‌ ఎన్నికల్లోనూ మాస్టర్‌‌ ప్లాన్‌‌, ఫ్యూచర్‌‌ సిటీ అంటూ హామీలు ఇచ్చి బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం గట్టెక్కింది. కానీ మాస్టర్‌‌ ప్లాన్‌‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే అప్పటి సీఎం కేసీఆర్‌‌ 43 నెలలు పెండింగ్‌‌లో పెట్టారు. 

అడ్డదిడ్డంగా వేలాది రూ. కోట్ల పనులు

కాకతీయ అర్బన్‌‌ డెవలప్‍మెంట్‍ పరిధిలో 2041 మాస్టర్‌‌ ప్లాన్‌‌ ప్రకారం నగరాన్ని 11 జోన్లుగా విభజించారు. ఇందులో రెసిడెన్షియల్‌‌, కమర్షియల్‌‌, మిక్స్‌‌డ్‌‌, ఇండ్రస్ట్రియల్‌‌ జోన్లు, గ్రోత్‌‌ కారిడార్స్‌‌, అగ్రికల్చర్, హెరిటేజ్‌‌ కన్జర్వేషన్‌‌ వంటి జోన్లు ఉన్నాయి. రిక్రియేషన్‌‌ జోన్‌‌ కింద పార్క్‌‌లు, గార్డెన్లు, గ్రీన్‌‌ బఫర్స్, ప్రొటెక్టెడ్‌‌ అన్‌‌ అవైలబుల్‌‌ జోన్ కింద వాటర్‌‌ బాడీస్‌‌, ఫారెస్ట్, కెనాల్స్ అభివృద్ది చేయాలి. కానీ ఇవన్నీ పేపర్లకే పరిమితం అయ్యాయి.

సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ స్మార్ట్‌‌ సిటీ, అమృత్‍, హృదయ్‌‌ పథకాలతో పాటు రాష్ట్ర సర్కార్‌‌, బల్దియా, కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న వేలకోట్ల పనులు ప్లాన్‌‌ ప్రకారం కాకుండా ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా చేస్తున్నారు. ఆపై మార్పులు, చేర్పులు అంటూ కట్టిన వాటిని కూల్చేస్తున్నారు.

ప్లాన్‌‌ లేకుండా పనులు చేస్తే నష్టమని తెలిసినప్పటికీ గత ప్రభుత్వం ఎలక్షన్ల పేరుతో గుడ్డిగా రూ.2,500 కోట్ల పనులకు శంకుస్థాపన చేసింది. కొన్ని రోజుల కిందటి వరకు ఎన్నికల కోడ్‌‌ కారణంగా గ్రేటర్‌‌ వరంగల్‌‌లో ఆగిన రూ.120 కోట్ల పనులకు సోమవారం హైదరాబాద్‌‌లో టెండర్లు ఓపెన్‌‌ చేశారు. అలాగే భవిష్యత్‌‌లో నగరానికి అండర్‌‌ గ్రౌండ్‌‌ డ్రైనేజీ, మమూనూరు ఎయిర్‌‌పోర్టు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాస్టర్‌‌ప్లాన్‌‌ను రూపొందించి పనులు చేయాల్సి ఉంటుంది. లేదంటే వేలాది కోట్లతో చేసిన పనులు కూల్చివేయక తప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్లాన్‌‌లో మార్పులు చేస్తామన్న ఇన్‌‌చార్జి మంత్రి

తెలంగాణలో కాంగ్రెస్‍ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి 20న హనుమకొండ కలెక్టరేట్‌‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి సమావేశానికి ఇన్‌‌చార్జి మంత్రి పొంగులేటి, మంత్రులు సీతక్క, సురేఖ హాజరయ్యారు. కేసీఆర్‍ సర్కార్‍ తమకు అనుకూలంగా రూపొందించుకున్న గ్రేటర్‌‌ వరంగల్‌‌ మాస్టర్‌‌ ప్లాన్‌‌ను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేసే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 

ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మాస్టర్‌‌ ప్లాన్‌‌ రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌‌ పార్టీ వరంగల్‌‌ మాస్టర్‌‌ ప్లాన్‌‌ అమలుపై మాట్లాడిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్లాన్‌‌ అమలు చేస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

లీడర్ల భూములు ఉన్న చోట రింగ్‌‌ రోడ్లు, ఐటీ కంపెనీలు

గ్రేటర్‌‌ వరంగల్‌‌ మాస్టర్‌‌ ప్లాన్‌‌ను 2013లోనే రూపొందించినప్పటికీ 2014లో బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక ప్లాన్‌‌ను తమకు అనుకూలంగా మార్చుకుంది. గ్రేటర్‌‌ చుట్టూరా 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు భూముల ధరలకు రెక్కలు రావడంతో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‍ లీడర్లు తమ బినామీల పేర్లతో భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేశారు. తర్వాత ఆ భూములకు దగ్గరగా రింగ్‌‌రోడ్లు వచ్చేలా ప్లాన్‌‌ను మార్చారు.

హైదరాబాద్‌‌ రోడ్డులోని మడికొండ, రాంపూర్‍ ఏరియాల్లో అప్పటి ఎమ్మెల్యేలు ఎకరాల కొద్దీ భూములు కొని వాటికి దగ్గర్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా చూసుకున్నారు. నగరాన్ని వివిధ జోన్లుగా విభజించే క్రమంలో తమ ఆస్తులు ఉండే చోట టెక్స్‌‌టైల్‌‌ పార్క్‌‌లు, ఐటీ కంపెనీలు వచ్చేలా ప్లాన్‌‌ చేసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి.