- నగరంలో నిరుపయోగంగా స్మార్ట్ టాయిలెట్స్
- దాదాపు రూ.కోటి వరకు దుర్వినియోగం
- హనుమకొండ కలెక్టరేట్ స్థలంలో కట్టిన కేఫ్ గతంలోనే కూల్చివేత
- నిరుపయోగంగానే మిగతా 'లూ కేఫ్‌లు'
- గతంలోనూ వివిధ పనుల్లో బయటపడ్డ డొల్లతనం
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ తిరుమల జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ టాయిలెట్ ఇది. ఈ స్థలం ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు చెందినది కాగా, కొంతకాలం కిందట జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో స్మార్ట్ టాయిలెట్ ను నిర్మించారు. కానీ, కొద్దిరోజుల కిందట ఆ స్థలం తమదేనంటూ సంబంధిత అధికారులు చుట్టూ కాంపౌండ్ కట్టేశారు. దీంతో గ్రేటర్ ఆఫీసర్లు నిర్మించిన స్మార్ట్ టాయిలెట్‌కు దారి లేకుండా పోయింది. లక్షలు పోసి కట్టిన టాయిలెట్స్ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనడంతో ఆఫీసర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్ల ప్రణాళికా లోపం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. సరైన ప్లానింగ్ లేకుండా పనులు చేపట్టడం, ఆ తరువాత వాటిని గాలికొదిలేస్తుండటంతో లక్షల రూపాయలు మిస్ యూజ్ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నగర ప్రజల అవసరాల కోసం దాదాపు రూ.కోటితో నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారగా, స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా గతంలో చేపట్టిన పనులు కూడా ఆఫీసర్ల ప్లానింగ్ లోపానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతోనే ప్రజాధనంతో పనులు చేపట్టి, వాటిని అక్కరకు రాకుండా చేస్తుండటంపై గ్రేటర్ ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
స్మార్ట్ టాయిలెట్స్‌కు తాళాలు..
వరంగల్ ట్రై సిటీకి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా నగరంలో రెండున్నరేండ్ల కిందటే లూకేఫ్‌ల పేరున స్మార్ట్ టాయిలెట్స్ నిర్మించారు. ఒక్కో దానికి దాదాపు రూ.16 లక్షల వరకు వెచ్చించి, సుమారు రూ.కోటితో ఆరు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. పేరుకు తగ్గట్టుగానే లైటింగ్, ఫ్లోరింగ్, మెన్, విమెన్‌కు సెపరేట్ గా లగ్జరీ వాష్ రూంలను డిజైన్ చేశారు. పీపీపీ పద్ధతిలో వీటిని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కానీ, వీటి ఏర్పాటులో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
దాదాపు మూడేండ్ల కిందటే లూ కేఫ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా, ప్రస్తుత హనుమకొండ కలెక్టరేట్ మెయిన్ గేట్ ఉన్న స్థలంలో లక్షలు పోసి లూ కేఫ్ నిర్మించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రేటర్ ఆఫీసర్లు దానిని ఓపెనింగ్ చేసిన కొద్దిరోజులకే కలెక్టరేట్ నిర్మాణ పనుల కోసం దానిని కూల్చేయాల్సి వచ్చింది. అక్కడ కలెక్టరేట్ నిర్మిస్తారని తెలిసి కూడా మున్సిపల్ ఆఫీసర్లు ప్లానింగ్ లేకుండా పనులు చేపట్టారని అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీంతోపాటు వరంగల్ సర్క్యూట్ హౌజ్ రోడ్డు-రామ్ నగర్ జంక్షన్, కాజీపేట నిట్, పోచమ్మమైదాన్, ఖిలా వరంగల్ లో కూడా లూ కేఫ్ లు ఏర్పాటు చేశారు. వాటిని జనాలకు అనువైన స్థలాల్లో నిర్మించకపోవడంతో, నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రూ.కోటితో ఏర్పాటు చేసిన స్మార్ట్ టాయిలెట్స్‌కు నిత్యం తాళాలేసే ఉంటున్నాయి.
ప్లానింగ్ లేక ఫండ్స్ దుర్వినియోగం
గ్రేటర్ ఆఫీసర్ల ప్లానింగ్ లోపం వల్ల పెద్దఎత్తున ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయి. గతంలో స్మార్ట్ సిటీ వర్క్స్ లో 'ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్' ఛాలెంజ్ లో భాగంగా హనుమకొండలోని ఫారెస్ట్ ఆఫీస్ నుంచి వరంగల్ ఎన్ఐటీ వరకు దాదాపు రూ.2 కోట్లతో సైకిల్ ట్రాక్ నిర్మించారు. రోడ్డు విస్తీర్ణాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతి కొలతలతో ట్రాక్ ను నిర్మించగా, ప్లానింగ్ లేకుండా దానిపై దిమ్మెలు కూడా ఏర్పాటు చేశారు. షాపులు, కాలనీల్లోకి వెళ్లే రోడ్లు ఉన్న చోట్లా సరైన ప్లాన్ లేకుండా సైకిల్ ట్రాక్ వేసుకుంటూ వెళ్లారు.
దీంతో ఆ ట్రాక్ వినియోగంలోకి రాకముందే నిరుపయోగంగా మారింది. ఆ తరువాత గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా అదే ట్రాక్ పై మొక్కలు కూడా నాటడంతో దాదాపు రూ.2 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ కాస్త బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఇదిలాఉంటే, అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా అమృత్ స్కీం కింద సుమారు రూ.20 కోట్లతో ఇంటింటా వాటర్ మీటర్లు ఏర్పాటు చేశారు.
అవి కూడా వినియోగంలోకి రాకుండానే శిథిలావస్థకు చేరాయి. ఇలా సిటీలో సరైన ప్లానింగ్ లేకుండా పనులు చేపడుతుండటం వల్ల ప్రజాధనం వృథా అవుతుండగా, అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా గ్రేటర్ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజాధనం వృథా అవకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.