ప్లానింగ్​ లేని పనులతో.. ప్రజాధనం వరదపాలు

  • రద పెరగడంతో బొల్లారంలోని చెక్ డ్యాం కూల్చివేత
  • ఇప్పటికే తెగిపోయిన జయవరం చెక్​డ్యాం
  • సైడ్​ కట్టలు నిర్మించకపోవడంతో పంట పొలాల్లోకి వరద
  • ఇండ్లల్లోకి నీరు రావడంతో బొల్లారంలో 32 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వేములవాడరూరల్, వెలుగు: అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వరదపాలైంది. కోట్ల రూపాయలతో రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్​మండలం జయవరం, లింగంపల్లి–బొల్లారం గ్రామాల మధ్యలో నిర్మించిన చెక్​డ్యాంలు పనికిరాకుండా పోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులో ప్రవాహం పెరిగి పంట పొలాలను ముంచెత్తుతుండడంతో బొల్లారంలోని చెక్​డ్యాంను బ్లాస్టింగ్ ​చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే జయవరం చెక్​డ్యాం వరద ప్రవాహానికి తెగిపోయింది. 

నిర్మాణ టైంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయకపోవడం వల్లే చెక్​డ్యాం మిషన్​ బ్రేకర్​తో కట్​చేయాల్సి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చెక్​డ్యాంలకు ఇరువైపులా కట్టలు నిర్మించకపోవడంతో సమీప పొలాలు కోతకు గురవుతున్నాయి.  పొలాలతోపాటు ఇండ్లల్లోకి నీరు రావడంతో కొంతమంది గ్రామస్తులను ఖాళీ చేయించారు. 

చెక్​డ్యాంకు సైడ్​కట్టలు నిర్మించలే.. 

వేములవాడ రూరల్​ మండలంలో మూలవాగుపై జయవరంలో రూ.7.50కోట్లతో 270 మీటర్ల వెడల్పు, 5.76ఎంసీఫ్(మిలియన్​ క్యూబిక్​ ఫీట్లు),  లింగంపల్లి–బొల్లారం గ్రామాల మధ్యలో రూ.5.67కోట్లతో 180 మీటర్ల వెడల్పు, 4.86 ఎంసీఎఫ్​నిల్వ సామర్థ్యంతో చెక్​డ్యాంలు నిర్మించారు. సరైన ప్రణాళిక లేకుండా చెక్​డ్యాంలు నిర్మించడంతోపాటు సైడ్​కట్టలు నిర్మించలేదు. చెక్​డ్యాంలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఎత్తుతో కట్టారన్న ఆరోపణలున్నాయి. దీంతో వాగులో వరద ప్రవాహం పెరిగినప్పుడల్లా నీరు పక్కనున్న పొలాల్లోకి చేరుతోంది. ఇటీవల కురిసిన వానలకు వాగు పక్కనున్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి. పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బోరుబావి మోటార్లు, చెట్లు, కరెంట్ స్తంభాలు కొట్టుకపోయాయి.  

బొల్లారం గ్రామంలోని ఇండ్ల వద్దకు, ఆలయం వద్దకు నీటిప్రవాహం రావడంతో 32 మందిని ఖాళీ చేయించి అధికారులు సురక్షిత ప్రదేశాలకు పంపించారు. తమ పంటలు కొట్టుకపోయాయని, రూ.లక్షల పెట్టుబడులు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా తమ భూములు అక్కరకు వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయి పరిస్థితుల అంచనాలో ఫెయిల్​

చెక్ డ్యాం నిర్మాణం చేపట్టే ముందు అధికారులు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అంచనాలు తయారు చేయాలి. సమస్యలు, లోటుపాట్లను అంచనా వేసి పనులు చేయాల్సి ఉండగా తూతూమంత్రంగా పరిశీలించి పనులు చేపట్టారన్న ఆరోపణలున్నాయి. అనంతరం నిర్మాణ పనులు కూడా అస్తవ్యస్తంగా చేపట్టడంతోనే వరదలు వస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. 

ప్రమాదాల నివారణకు చర్యలు

వాగుపై నిర్మించిన చెక్​డ్యాంను నీటి ప్రవాహంతో గ్రామాలకు, రైతులకు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా రెండు రోజులుగా చెక్​డ్యాంను మిషన్​ బ్రేకర్​తో తొలగిస్తున్నాం. 160 మీటర్ల చెక్​డ్యాం నిర్మాణం ఉండగా 34 మీటర్లు లెంత్​లో, 1 మీటర్​ డెప్త్​ తో చెక్​డ్యాం కట్​ చేయిస్తున్నాం. 
-శ్రీనివాస్​, ఇరిగేషన్​ డీఈ, వేములవాడ