- సింగరేణిలో నాణ్యత లేకుండా నిర్మాణాలు
- అధికారులు పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యం
- ఇస్టానుసారంగాకాంట్రాక్ట్ సంస్థల పనులు
- రూ. వందల కోట్ల నిర్మాణాల్లోనూ లోపాలు
- బొగ్గు ఉత్పత్తి, ట్రాన్స్ పోర్ట్ పైనా ప్రభావం
- పనులపై కార్మిక సంఘాల నేతల విమర్శలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థలో వందల కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ కొరవడింది. ఆఫీసర్ల తనిఖీలు లేకపోవడంతో కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా మారింది. దశాబ్దాల పాటు ఉండాల్సిన నిర్మాణాలు కొద్ది నెలల్లోనే ఖరాబ్ అవుతున్నాయి. దీంతో క్వాలిటీ లేని పనుల కారణంగా మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. అభివృద్ధి పనుల్లో నిత్యం ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండడకపోవడంతో పాటు నిర్మాణాల్లో నాణ్యతపై పర్యవేక్షించడంలేదు. తాజాగా కొత్తగూడెం కార్పొరేట్పరిధిలో నిర్మిస్తున్న క్వార్టర్ల పనుల్లో నాణ్యత లేదంటూ కార్మికసంఘాల నేతలు ఆరోపిస్తున్నా.. ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
నిర్మించిన రెండేండ్లకే పగుళ్లు
కొత్తగూడెం ఏరియా జేవీఆర్సీహెచ్పీలో భాగంగా రెండేండ్ల కింద రూ. 390కోట్లతో మూడు బంకర్లు, బెల్ట్, బిల్డింగ్, క్రషర్స్వంటి పనులను ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ చేపట్టింది. రోజుకు ఒక్కో బంకర్ 8వేల టన్నుల బొగ్గు సామర్థ్యం ఉండే విధంగా నిర్మించింది. 3 బంకర్లకు గాను రోజుకు 24 వేల టన్నుల బొగ్గు వస్తుంది. అక్కడి నుంచి పరిశ్రమలకు రైల్వే వ్యాగన్ల(రేకులు) ద్వారా ట్రాన్స్ పోర్టు చేస్తారు. ఇదిలా ఉండగా రెండో బంకర్లో బాటం పిల్లర్లకు ఇటీవలి పగుళ్లు ఏర్పడ్డాయి. నిర్మించిన రెండేండ్లకే పగుళ్లు రావడంతో ఆఫీసర్లు ఆందోళన చెంది.. వెంటనే మూసివేశారు. దీంతో ప్రతిరోజు 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడిందని, ట్రాన్స్ పోర్టు కూడా తగ్గిందని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు.
ఎక్కడ లోపమనేది గుర్తించలే..
బంకర్ కు వచ్చిన పగుళ్లపై హైదరాబాద్ ఐఐటీతో పాటు రాంచీలోని ఇంజనీరింగ్ టీమ్ లు వచ్చి పరిశీలించాయి. ఎక్కడ లోపం జరిగిందో ఇంకా గుర్తించలేదు. నిర్మాణాలు పూర్తైన తర్వాత కేవలం ఏడాది పాటే వర్క్స్చేసిన సంస్థ రెస్పాన్స్ కాగా.. ఆ సంస్థ ద్వారానే రిపేర్లు చేయిస్తామని సింగరేణి ఆఫీసర్లు పేర్కొంటుండడం గమనార్హం. పగుళ్లు ఏర్పడిన బంకర్‌ను నెల రోజులుగా మూసివేయడం, జరిగిన నష్టాన్ని ఎవరి ద్వారా రికవరి చేస్తారో చూడాల్సి ఉందని కార్మికులు పేర్కొంటున్నారు.
“ బెల్లంపల్లి రీజియన్ కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ఏరియాలో రూ. 1.65కోట్లతో నిర్మించిన హుమ్పైప్ బ్రిడ్జి ఇటీవలి వరదలకు కొట్టుకుపోయింది. గతేడాది ఫిబ్రవరిలో నిర్మించిన ఈ బ్రిడ్జి రెండేండ్లు కూడా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ నాణ్యతతో కట్టకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే బ్రిడ్జి కొట్టుకుపోయిందని విమర్శలు వస్తున్నాయి.’’
కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో రూ. 250కోట్లతో నిర్మిస్తున్న క్వార్టర్ల నిర్మాణంలోనూ అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. భూమి లోపలి నుంచి పిల్లర్ల నిర్మాణ అనంతరం మట్టితో పూడ్చాల్సి ఉండగా రాళ్లు రప్పలతో కూడిన మట్టితో పూడ్చివేసినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు పనులు ఇస్టానుసారంగా చేస్తుండగా.. సివిల్ ఇంజనీరింగ్ అధికారులు అటువైపు వెళ్లకపోవడంతో పాటు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వచ్చాయి. కార్పొరేటర్ పరిధిలోని హెడ్డాఫీస్ సమీపంలో ఎపిక్ సెంటర్‌కు వెళ్లే దారిలో నిర్మించిన రోడ్డు రెండేండ్లకే ఖరాబైంది. తరచూ రిపేర్లు చేయడం కామన్‌గా మారింది.’’
రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటాం
బంకర్‌కు పగుళ్లు ఏర్పడడంపై హైదరాబాద్ నుంచి ఐఐటీ ఇంజనీర్లు వచ్చి పరిశీలించి వెళ్లారు. నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు చేపడతాం. భారీగా పగుళ్లు ఏర్పడిన బంకర్‌ను క్లోజ్చేశాం. అయినా.. బొగ్గు ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్టుకు ఎలాంటి సమస్య లేదు. వానలతోనే బొగ్గు ఉత్పత్తి రావడం లేదు. - షాలెం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా
నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నాం
సింగరేణి సంస్థలో చేపట్టే పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేట్పరిధిలో నిర్మిస్తున్న క్వార్టర్లలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. క్వాలిటీ కంట్రోల్అధికారులతో పాటు నాణ్యతను పరిశీలిస్తాం. - సూర్యనారాయణ, జీఎం, సివిల్ డిపార్ట్మెంట్
క్వాలిటీ లేకనే బంకర్ కు పగుళ్లు
నాణ్యతలేని పనులతో బంకర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పనుల్లో ఎంత నాణ్యత పాటించారనేది తెలుస్తుంది. క్వాలిటీ లేకుండా నిర్మించిన సంస్థతో పాటు పర్యవేక్షించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి. - ఎండీ. రజాక్, వైస్ ప్రెసిడెంట్, ఐఎన్టీయూసీ
కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి
నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. అభివృద్ధి పనులను ఆఫీసర్లు పక్కాగా పర్యవేక్షించాలి. కోల్బంకర్, క్వార్టర్లు, రోడ్ల నిర్మాణాల్లో క్వాలిటీ పాటించకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. - వంగా వెంకట్, వర్కర్స్యూనియన్సెంట్రల్ ఆర్గనైజింగ్‌సెక్రటరీ