
- గతంలో వేలాడే వంతెనల ఏర్పాటుకు ప్రతిపాదనలు
- ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో ముందుకు పడలే
- నీటి మీది రాతలుగాపాలకుల హామీలు
నేరడిగొండ , వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం దగ్గర ఎలాంటి సదుపాయాలు, రక్షణ చర్యలు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ జలపాతానికి ఏటా వర్షాకాలంలో పర్యాటకుల తాకిడి ఉంటుంది. జలపాతం దగ్గర సెల్పీలు తీసుకునేందుకు పర్యాటకులు సరదా పడుతుంటారు. దీంతో ఎప్పుడూ ఇక్కడ సందడిగా ఉంటుంది. అయితే జలపాతం వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో చాలా మంది జలపాతంలోని సుడిగుండాల్లో మునిగి చనిపోతున్నారు.
కనిపించని రక్షణ చర్యలు
పై నుంచి దూకే నీటి పరవళ్లను చూసేందుకు దగ్గరగా వెళ్లి, నునుపైన బండరాళ్లపై నుంచి జారిపడి చనిపోతున్నారు. ప్రమాదాల నివారణకు గతంలో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. జలపాతం అందాలను దగ్గర నుంచి చూడాలంటే 408 మెట్లు కిందకు దిగాల్సి ఉంటుంది. ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా నియంత్రించేందుకు గతంలో అధికారులు భావించగా, స్థానిక ఆదివాసీలు అభ్యంతరం తెలిపారు. జలపాతాల వద్ద వెలిసిన తమ దేవతలను పూజించడానికి అడ్డంకులు కల్పించరాదని అధికారులు వెనక్కి తగ్గారు.
ప్రతిపాదనలు మాత్రమే.. ఫండ్స్ ఇవ్వరు.
జలపాతం వద్ద రక్షణ చర్యలు, అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తామని గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఐటీడీఏ ద్వారా రూ. 3 కోట్ల 18 లక్షల పనుల కోసం ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగలేదు. పర్యాటకుల కోసం సదుపాయాలు కల్పించలేదు. ప్రమాదాల నివారణ చర్యలు లేకపోవడంపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కుంటాల వద్ద రోప్ వే , హరిత హోటల్ తో పాటు వేలాడే వంతెన నిర్మాణం కోసం సర్వే చేశారు. వేలాడే వంతెనలు నిర్మిస్తే వాటి పైకి ఎక్కి జలపాతాన్ని దగ్గర నుంచి చూసేందుకు వీలవుతుంది . దీనివల్ల ప్రమాదాలు నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు.
రక్షణ చర్యలు చేపడతాం
గతంలో కుంటాల వాటర్ ఫాల్ అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. టెండర్లు పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు చేపడతాం. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నాం.
-రవికుమార్ , టూరిజం శాఖ జిల్లా అధికారి.
ఎలాంటి సౌకర్యాలు లేవు...
కుంటాల వాటర్ ఫాల్స్ కు ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మేము వెళ్లిన ప్రతిసారి అక్కడ నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఇలాంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే జిల్లాకు మంచి పేరు వస్తుంది.
-కడారి రాజు , వడూర్