వాన లెక్క తప్పుతోంది.. కనిపించని శాస్త్రీయత

  • మండల కేంద్రాల్లోనే రెయిన్​గేజ్‌‌లు 
  • గ్రామాల్లో పడిన వానను లెక్కల్లో చూపట్లే 
  • మండలాన్ని యావరేజ్​ చేసి తీసుకుంటున్నరు
  • డిఫరెన్స్‌‌ను ఆఫీసర్లు గుర్తిస్తలేరు 
  • కరువు అంచనా, ఇన్సూరెన్స్‌‌పై ఎఫెక్ట్​

పెద్దపల్లి, వెలుగు: వర్షం నమోదులో శాస్త్రీయత లేకపోవడంతో కచ్చితమైన లెక్కలు ఉండడం లేదు. ఒక్కో మండలం కనీసం 20 చ.కి.మీ పరిధిలో ఉండగా, మండలకేంద్రాల్లోనే  రెయిన్​గేజ్‌‌లు ఉన్నాయి. దీంతో మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కురిసిన వాన లెక్కకు రావడం లేదు. కేవలం మండలకేంద్రాల్లో పడ్డ వానను లెక్కలోకి తీసుకొని యావరేజ్​ చేసి అదే మండలం వర్షపాతంగా పేర్కొంటున్నారు. సాధారణంగా ఒక ప్రాంతంలో పడిన వాన మరో ప్రాంతంలో పడకపోవచ్చు. అప్పుడు ఆ మండలం మొత్తం వర్షపాతాన్ని లెక్కగట్టడం సరికాదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పద్ధతిలో కొన్ని మండలాలకు చెందిన గ్రామాల్లో అధిక వర్షపాతం నమోదైనా, రెయిన్​ఫాల్​ రికార్డు చేసినప్పుడు యావరేజ్​లో తక్కువగా నమోదవుతుంది. దీనివల్ల  పంటలు కొట్టుకుపోయినా ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదు. రెయిన్​గేజ్‌‌లను ఆధారంగా చేసుకొని పంట నష్టాలను లెక్కించడం సరికాదని రైతులు పేర్కొంటున్నారు. 

కరువు అంచనాల్లోనూ ఇబ్బందులు

వర్షపాతం నమోదు ప్రమాణాలు కొరవడటంతో కరువు అంచనాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం ప్రకారం ఒక వర్షపు రోజు నుంచి మరో వర్షపు రోజు మధ్య 15 రోజుల గ్యాప్​ఉంటేనే ఆ ప్రాంతంలో కరువు ప్రభావం ఉన్నట్లు అధికారులు పరిగణిస్తారు. అంటే 2.5 మి.మీకు పైగా కురిసిన వాననే ఒక వర్షపు రోజుగా గుర్తిస్తున్నారు. ఇంతగా ప్రాధాన్యత ఉన్న వర్షపాత నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

దీని ఆధారంగా అధికారులు పరిస్థితులు అంచనా  వేసి నివేదికలు రూపొందించాల్సి ఉంటుంది. ఆ మేరకు కరువు ప్రాంతాలను ప్రభుత్వం గుర్తిస్తుంది. వర్షపాత నమోదుకు ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో తహసీల్​ఆఫీసుల్లో ఉన్న కింది స్థాయి ఉద్యోగులే రెయిన్​ ఫాల్​రికార్డులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 11 చోట్ల సాధారణ రెయిన్​గేజ్​, 14 చోట్ల ఆటోమెటిక్​ కేంద్రాలున్నాయి. సాధారణ కేంద్రాల్లో తహసీల్దార్​ పర్యవేక్షిస్తుండగా, ఆటోమెటిక్​ కేంద్రాలను రాష్ట్ర స్థాయి సర్వర్​కు​ అనుసంధానం చేశారు. ఆటోమెటిక్​ మిషన్​ అమర్చిన ప్రాంతంలో వర్షం కురిస్తే నేరుగా సర్వర్​లో సమాచారం చూపిస్తోంది. 

క్రాప్​ ఇన్సూరెన్స్‌‌పై ఎఫెక్ట్​

రెయిన్​ఫాల్​నమోదు ఆధారంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పంటబీమా పథకాల కింద నష్టపోయిన రైతులకు పరిహారం అందే అవకాశం ఉంటుంది.  కంపెనీలు కూడా ఆటోమెటిక్​ రెయిన్​ఫాల్​ స్టేషన్​ సమాచారం ఆధారంగానే బీమా సొమ్ము చెల్లిస్తుంటాయి. కాగా యావరేజ్​రెయిన్​ఫాల్​నమోదు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని మండలాల్లో వర్షపాతం గ్రామాగ్రామానికి మారుతుంటుంది. దీంతో మండలంలోని నాలుగైదు గ్రామాల్లో అధిక వర్షపాతం నమోదై వందల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయే అవకాశాలున్నాయి. 

అలాంటి సమయంలో అధికారులు వర్షపాతాన్ని యావరేజ్‌‌గా రికార్డు చేసినప్పడు ఆ మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. అలాంటప్పుడు వర్షపాతం ఎక్కువ ఉండి, పంటలు కొట్టుకుపోయిన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.  ప్రతి 10 కి.మీ పరిధిలో వర్షపాత నమోదు కేంద్రం ఏర్పాటు చేయాలన్న నిబంధనలను అధికారులు పట్టించుకుంట లేరు. మండలానికో రెయిన్​గేజ్​ కాకుండా ప్రతీ గ్రామానికి ఒక రెయిన్​గేజ్​ ఉంటే కరెక్ట్​ రెయిన్​ఫాల్​ రిపోర్టు వస్తుందని రైతులతోపాటు అధికారులు అభిప్రాయపడుతున్నారు..