యూనివర్సిటీల్లో సీనియర్ ప్రొఫెసర్ల కొరత

యూనివర్సిటీల్లో సీనియర్ ప్రొఫెసర్ల కొరత
  • రిటైర్మెంట్లతో భారీగా‌ తగ్గిన ప్రొఫెసర్ల సంఖ్య
  • చివరిసారిగా కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే నియామకాలు
  • సూపర్ వైజర్లు లేక తగ్గిన పీహెచ్‌డీ అడ్మిషన్లు
  • 65 ఏండ్లకు ఏజ్ లిమిట్ పెంచాలంటున్న వర్సిటీ టీచర్స్ అసోసియేషన్లు

కరీంనగర్, వెలుగు:యూనివర్సిటీల్లో సీనియర్ ప్రొఫెసర్ల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. ఓ వైపు పదవీ విరమణ చేస్తుండడం, పదేండ్లుగా రిక్రూట్ మెంట్ లేకపోవ డంతో ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ల కొరత వేధిస్తోంది. ఒక్క ప్రొఫెసర్ కూడా లేని డిపార్ట్ మెంట్లు కొన్ని ఉండగా, ఒకరిద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఉన్న డిపార్ట్ మెంట్లు చాలా ఉన్నాయి.

వచ్చే ఏడాది రెండేండ్లలో జరిగే రిటైర్మైంట్లతో చాలా విభాగాలు పూర్తిగా ఖాళీ కాబోతున్నాయి. రెగ్యులర్ ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉండడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల(కాంట్రాక్ట్)కు సూపర్ వైజర్లుగా అవకాశం ఇవ్వకపోవడంతో పీహెచ్​డీ అడ్మిషన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రిక్రూట్ మెంట్ పూర్తయ్యేవరకైనా రెగ్యులర్ ఫ్యాకల్టీ సేవలను ఉపయోగించుకునేందుకు ప్రొఫెసర్ల రిటైర్మైంట్ ఏజ్ లిమిట్ ను 60 నుంచి 65 ఏండ్లకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

పరిశోధనలపై ప్రభావం.. 

యూనివర్సిటీల్లో టీచింగ్, రీసెర్చ్ రెండూ నిరంతరం జరగాల్సిన పనులు. ఇందులో పీహెచ్​డీ, సెట్, నెట్ అర్హత కలిగిన కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లతో విద్యాబోధనను నెట్టుకొస్తున్నప్పటికీ.. రెగ్యులర్ ఫ్యాకల్టీ కొరత కారణంగా యూనివర్సిటీల్లో పరిశోధన పూర్తిగా కుంటుపడింది. పదేండ్ల క్రితం వరకు ఒక్కో డిపార్ట్ మెంట్​లో 5 నుంచి 10 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటే.. ఒక్కొక్కరి దగ్గర ఆరు నుంచి 8 మంది రీసెర్చ్ స్కాలర్స్​ ఉండేవారు.

దీంతో విస్తృతమైన పరిశోధనలు జరిగేవి. ఇప్పుడు కొన్ని డిపార్ట్​మెంట్లలో ఒక్కరూ లేకపోవడం, కొన్నింట్లో ఒకరిద్దరు మాత్రమే ఉండడంతో పీహెచ్ డీ అడ్మిషన్లు కూడా సింగిల్ డిజిట్స్​లోనే అవుతున్నాయి. చివరికి యూజీసీ జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్ లాంటి ఫెలోషిప్ లకు ఎంపికైన విద్యార్థులకు కూడా అడ్మిషన్లు దొరకని దుస్థితి నెలకొంది. నిరుడు కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్​డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు చేసిన ఆందోళనకు దారితీసిన కారణాల్లో సీట్ల కొరత కూడా ఒకటనే వాదన ఉంది. 

ఇతర రాష్ట్రాల్లో పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లు 

దేశంలోని పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, పాండిచ్చేరి, ఢిల్లీ, అసోం వంటి రాష్ట్రాల్లో యూనివర్సిటీల్లో ఇప్పటికే  ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచారు. అంతేగాక గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మిజోరం, గోవా తదితర రాష్ట్రాల్లో 60 ఏండ్ల నుంచి 62 ఏండ్లకు పెంచారు. గత బీఆర్‌‌ఎస్ సర్కార్ మెడికల్ కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లకు మాత్రమే ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏండ్లకు పెంచి యూనివర్సిటీల్లో మాత్రం పాత పద్ధతినే కొనసాగించింది.  

పదేండ్లుగా పట్టించుకోలే.. 

యూనివర్సిటీల్లో 2,825 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ సాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి.  ఇందులో ప్రస్తుతం సుమారు 800 మంది మాత్రమే పనిచేస్తుండగా 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే 2004, 2006, 2010లో పలు దఫాలుగా యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేయలేదు.

1,061 ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి 2017లో జీవో జారీ చేసి హడావుడి చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీల్లో రిక్రూట్​మెంట్​కు 2022లో కామన్ రిక్రూట్​ బోర్డును ఏర్పాటు చేశారు. కానీ, ఈ బిల్లును అప్పటి గవర్నర్ ఆమోదించకుండా పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపడంతో రిక్రూట్​మెంట్​ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రభుత్వ యూనివర్సిటీల్లో రిక్రూట్​మెంట్​ చేయడం ఇష్టం లేకే చిక్కులతో కూడిన బోర్డును ముందుకు తెచ్చారనే విమర్శలు వినిపించాయి. 

కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల సర్వీస్ గుర్తింపు లేదు.. 

ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీల్లో పీహెచ్​డీ, సెట్, నెట్ అర్హత కలిగిన కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లే పని చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసినప్పటికీ.. యూనివర్సిటీల్లోని క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు. యూజీసీ నిబంధనలను సాకుగా చూపి.. వీళ్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను పక్కన పెట్టారు.

దీంతో వీరికి 10 నుంచి 25 ఏండ్ల వరకు సర్వీసు ఉన్నా కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లుగా రిటైర్డ్ అవుతున్నారు. అంతేగాక వీరి సర్వీసుకు ఎలాంటి గుర్తింపు ఉండడం లేదు. ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసును యూనివర్సిటీలు ర్యాటిఫై చేస్తున్నప్పటికీ.. యూనివర్సిటీల్లో పని చేసే వారి సర్వీసును మాత్రం చేయడం లేదు. దీంతో ఇతర యూనివర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రైవేట్ కాలేజీల్లో పని చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అర్హత పొందుతున్నప్పటికీ.. యూనివర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాత్రం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. 

65 ఏండ్లకు పెంచాలి

గత ప్రభుత్వం మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ విరమణ వయసును పెంచి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు మాత్రం పెంచలేదు. యూనివర్సిటీలకు న్యాక్, ఎన్​బీఏ లాంటి గుర్తింపు రావాలన్నా, యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ ఐఆర్ నుంచి పరిశోధన, యూనివర్సిటీల అభివృద్ధి కోసం నిధులు రావాలన్నా యూనివర్సిటీల్లో తగినంత టీచింగ్ స్టాఫ్ అవసరం. సరైన సంఖ్యలో బోధన సిబ్బంది లేకుంటే యూనిర్సిటీల్లో నాణ్యమైన బోధన, పరిశోధన కుంటుపడే అవకాశాలున్నాయి.  ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచితేనే వచ్చే మూడు, నాలుగేండ్ల వరకైనా క్లాసులు చెప్పడానికి, పీహెచ్ డీ గైడ్ షిప్ కు ప్రొఫెసర్లు ఉంటారు. 

-డాక్టర్ మామిడాల ఇస్తారి, అకుట్ జనరల్ సెక్రటరీ