సివర్ జెట్టింగ్ మెషీన్ల లేమి.. ఇంకా కార్మికులతోనే మ్యాన్​హోల్స్​ క్లీనింగ్

హైదరాబాద్, వెలుగు: మ్యాన్​హోల్స్​ను క్లీన్ ​చేసేందుకు తమ దగ్గర పెద్ద పెద్ద మెషీన్లు ఉన్నాయని వాటర్​బోర్డ్​ అధికారులు చెబుతున్నప్పటికీ చాలాచోట్ల కార్మికులతోనే క్లీనింగ్ చేయిస్తున్నారు. 212 ఎయిర్​టెక్ మెషీన్లు (సివర్ జెట్టింగ్ మెషీన్లు) ఉన్నప్పటికీ అవి సరిపోవట్లేదు. దీంతో మనుషులు మ్యాన్​హోల్​లో దిగి క్లీన్ చేసేంతవరకు అందులోని పూడిక బయటికి పోవడం లేదు. కొన్నిచోట్ల వాటర్​బోర్డ్ అధికారులే స్వయంగా కార్మికులను మ్యాన్ హోల్స్​లోకి దింపుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసినా అధికారులు త్వరగా పనులు చేయించకపోవడంతో స్థానికులే  బయటి వ్యక్తులను మ్యాన్ హోళ్లలోకి దింపి క్లీన్ చేయిస్తున్నారు.వానలు పడితే దారుణ పరిస్థితులు..మ్యాన్​హోల్స్ లోకి   కార్మికులు దిగి క్లీన్ చేయాల్సిన అవసరం లేదని, జెట్టింగ్ మెషీన్లతో ఆ పనులు చేయిస్తామని వాటర్​బోర్డ్ ​అధికారులు గొప్పలు చెబుతునప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఓ చోట మనుషులే దిగాల్సి వస్తోంది. వారు క్లీన్ చేసేంత వరకు కూడా పనులు కావడం లేదు. సీవరేజ్ పైప్ లైన్లు జామ్ అయిన సందర్భంలో క్లీన్ చేసేందుకు ఉపయోగించే ఎయిర్ టెక్ మెషీన్లు సరిపోకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కంప్లయింట్ చేసిన వెంటనే త్వరగా క్లీన్ చేసేందుకు మెషీన్లు రావడం లేదు. ప్రస్తుతం వర్షాలు మొదలవ్వడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయి. వాటర్​బోర్డు పరిధిలో ప్రస్తుతం కోటిన్నరకుపైగా జనాభా ఉండగా.. సివర్​జెట్టింగ్ మెషీన్లు 212 మాత్రమే ఉన్నాయి.

ప్రతి నెలా రూ. కోట్లలో ఖర్చు..

డ్రైనేజీ పైప్​లైన్ల రిపేర్లు, మెయింటెనెన్స్​పేరుతో ప్రతి నెలా కోట్లాది రూపాయలను వాటర్​బోర్డ్ ఖర్చు చేస్తున్నప్పటికీ సమస్య మాత్రం తీరడం లేదు. ప్రస్తుతం నెలకు రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతున్నా సమస్య మాత్రం తీరడం లేదు. ఎప్పుడో నిర్మించిన డ్రైనేజీ సిస్టం కావడంతోనే సీజన్​తో సంబంధం లేకుండా అనేక మ్యాన్​హోళ్లు నిత్యం పొంగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీలో డ్రైనేజీ సిస్టమ్ లేదని ఎక్స్​పర్ట్స్​పేర్కొంటున్నారు. సిటీలో అవసరమైన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా డ్రైనేజీ వ్యవస్థను మార్చాలని కోరుతున్నారు.

ALSO READ:దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే భారీ చోరీ

మనుషులను దింపకూడదంటూ ఆదేశం

మ్యాన్​హోల్స్​లోకి సిబ్బందిని దింపి క్లీన్ చేయించే అంశంపై జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సైతం గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది సాహెబ్ నగర్​లో డ్రెయిన్ క్లీన్ చేసేందుకు మ్యాన్​హోల్​లోకి దిగి ముగ్గురు చనిపోయిన సమయంలో అధికారులపై సఫాయి కర్మచారి కమిషనర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. సిబ్బందిని మ్యాన్ హోళ్లలోకి దింపకుండా చూడాలని ఆదేశించింది. అయినప్పటికీ డైలీ ఎక్కడో ఓ చోట మనుషులు దిగుతూనే ఉన్నారు. ఈ సమస్య తీరాలంటే జెట్టింగ్ మెషీన్ల సంఖ్యను పెంచాలి. కానీ ఈ అంశంపై అధికారులు సరిగా దృష్టి పెట్టడం లేదు. 1,500 లీటర్ల మెషీన్లను మరో 65 తీసుకునేందుకు వాటర్​బోర్డు టెండర్లు వేసినప్పటికీ గందరగోళంతో ఆ ప్రక్రియకు ఆలస్యమవుతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సమస్య మరింత తీవ్రతరం కానున్న నేపథ్యంలో ఇప్పటికైనా త్వరగా టెండర్లను పూర్తిచేసి మెషీన్లను అందుబాటులోకి తీసుకొచ్చి తమపై భారం తగ్గించాలని సిబ్బంది కోరుతున్నారు.

కార్మికులకు జీతాలు పెంచాలి

వాటర్​బోర్డ్​ అధికారులు కార్మిక చట్టాలను పాటించడం లేదు. నిత్యం మురుగునీటిలో పనిచేస్తున్న సఫాయి కార్మికులను ఎవరూ పట్టించుకోవడం లేదు. వారికి కేలం రూ.10 వేల జీతం మాత్రమే ఇస్తున్నరు. మురుగులో పనిచేసి అనారోగ్యాల బారిన పడి వందలాది మంది చనిపోయారు. కార్మికుల శ్రమ, ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని వారికి జీతాలు పెంచాలి.

ఊదరి గోపాల్, వాటర్ బోర్డ్ సీవరేజీ జేఏసీ చైర్మన్