ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి భారీ మెజార్టీ సాధిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145 సీట్లను ఇప్పటికే అధిగమించిన మహాయుతి కూటమి.. 200 సీట్ల మార్క్‌ను సైతం క్రాస్ చేసింది. మహా వికాస్ అఘాడీ కూటమిని చిత్తు చేస్తూ.. ప్రస్తుతం 220 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అధిక్యంలో దూసుకుపోతుంది.
మహారాష్ట్రలో మహాయుతి గెలుపు ఖాయం కావడంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. మహయుతి గెలుపులో లడికీ బెహెన్ స్కీమ్ గేమ్ ఛేంజర్ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మేం కొంత ఇబ్బంది పడ్డాం.. మహాయుతి కూటమికి తక్కువ సీట్లు వచ్చాయి.. దానిని నుండి గుణపాఠం నేర్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బలంగా పుంజుకున్నామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత పెద్ద విజయాన్ని ఊహించలేదని.. మహయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో మా బాధ్యత మరింత పెరిగిందని.. వచ్చే ఐదేండ్లు ప్రజలకు బెస్ట్ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా అజిత్ పవార్ ధన్యవాదాలు తెలిపారు.