బొంబాయి (ప్రస్తుతం ముంబై)లోని హ్యాపీ బుక్‌స్టాల్ యజమానులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 292 ప్రకారం పెట్టిన కేసుని సుప్రీంకోర్టు సమర్థించి 60 ఏండ్లు అవుతోంది. ఆ బుక్‌స్టాల్ యజమానులపై పెట్టిన కేసు విచారణని, నేరారోపణలను సుప్రీంకోర్టు 60 ఏండ్ల క్రితమే సమర్థించింది. ఇంతకీ వారు అమ్మిన అశ్లీల పుస్తకం ఏమిటంటే.. అది ప్రఖ్యాత నవలా రచయిత డీహెచ్ లారెన్స్ రాసిన ‘లేడీ చాటర్లీ లవర్’ ఆ నవలను తమ పుస్తకాల షాపులో విక్రయించడం వాళ్లు చేసిన నేరం. చాటర్లీని భారత ప్రభుత్వం, కోర్టులు ఎలా చూశాయన్న విషయం రంజిత్డి ఉదేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుని చదివితే తెలుస్తోంది. ఆ పుస్తకాల షాప్ యజమాని అశ్లీల నవలను అమ్ముతున్నాడన్న ఆరోపణపై అతడిమీద సెక్షన్292 ఐపీసీ ప్రకారం కేసుని నమోదు చేశారు. కింది కోర్టులు అతడికి శిక్షను ఖరారు చేశాయి. ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయన్న కారణంగా ఉదేషి.. సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేశాడు. సెక్సువల్ విషయాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ.
ఈ కేసులో కోర్టుముందు తలెత్తిన అంశాలు..
1. ఐపీసీ సెక్షన్ 292 అనేది రాజ్యాంగబద్ధమా? అది రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగిస్తుందా?
2. లేడీ చాటర్లీ లవర్ పుస్తకంలోని అంశాలు సెక్షన్ 292 ఐపీసీ ప్రకారం అశ్లీలమా?
3. ఈ నిబంధనలో క్రిమినల్ ఉద్దేశం ఉంటుందా?
కోర్టుల వ్యాఖ్యానాలు మారుతుంటాయ్
కోర్టుల వ్యాఖ్యానాలు మారుతూ ఉంటాయి. మారిన సమాజాన్నిబట్టి, పరిస్థితులను బట్టి కోర్టు వ్యాఖ్యానాలు చట్టం విషయంలో మారుతూ ఉంటాయి. ఈ కేసు విషయంలో కూడా అదే జరిగింది. అబిన్ సర్కార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో భారత సుప్రీంకోర్టు హిక్లిన్ టెస్ట్‌ని తోసిపుచ్చింది. రంజన్ ఉదేషి కేసులో చెప్పిన విషయాన్ని తిరగరాసింది. కమ్యూనిటీ స్టాండర్డ్ టెస్ట్‌ని అబీన్ సర్కార్ కేసులో సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. సమకాలీన పరిస్థితులను, అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేసి ఈ కొత్త టెస్ట్‌ని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది.
9వ శతాబ్దంలో చెప్పిన వ్యాఖ్యానాన్ని తోసిపుచ్చాల్సిన అవసరం ఏర్పడిందని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొంది. సదురేశ్ బోస్ వర్సెట్ అమూల్మిత్ర (1985), ఎస్ ఖుష్బూ వర్సెస్ కన్ని అమ్మాల్ (2010) వంటి తీర్పులు ద్వారా సామాజిక దృక్పథాల్లోని మార్పులను కోర్టు అంగీకరించినట్లు అనిపిస్తోంది.
మారువేషంలో పుస్తకాలు కొన్న పోలీసులు
భారతీయ క్రిమినల్ చట్టంలో అశ్లీలతని వివరించే పరిణామానికి ప్రారంభ బిందువుగా రంజిత్ ఉదేశ్కేసును పేర్కొనవచ్చు. రంజిత్ ఉదేశ్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం, భారత ప్రభుత్వ చర్యలు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చాటర్లీ లవర్ నవలలోని మనోహరమైన ముగింపు విషయంలో కోర్టు, పోలీసులు ఎలా వ్యవహరించారన్నది మనకు అర్థమవుతుంది. మారువేషంలో పోలీసులు పుస్తకాలను కొనడం, ప్రాసిక్యూషన్ చేయడం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 60 సంవత్సరాల క్రితం జరిగిన కేసులో న్యాయబద్ధతను చర్చించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
కోర్టు వ్యాఖ్యానాలు అన్నిసార్లు ఒకేలా ఉండవు
సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను అనవసరంగా పరిహాసం చేసిందని అనిపిస్తుంది. ఈ కేసును పరిశీలించినప్పుడు మనకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. మనదేశంలో చాటర్లీ లవర్ని సెన్సార్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేసిందన్న విషయం మనకు కనిపిస్తుంది. కోర్టుల వ్యాఖ్యానాలు అన్నిసార్లు స్థిరంగా ఉండవు. అవి సమాజాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఏమైనా భావ ప్రకటనా స్వేచ్ఛకి అడ్డుకట్ట వేయడం సమంజసం కాదని అనిపిస్తోంది. ‘శిక్ష’ అనే కవితలో ఇలా అన్నాను.. ‘నిన్నటి అన్యాయం నేటి న్యాయంగా మారిపోతుంది. నేటి న్యాయం రేపటి అన్యాయం కావొచ్చు’. అశ్లీలత విషయంలోనే కాదు భావ ప్రకటన విషయంలో కూడా అంతే.
ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం అశ్లీలత..
అశ్లీలత నేరపూరిత స్వభావాన్ని .. ఐపీసీ సెక్షన్ 292 తెలియజేస్తోంది. కానీ, అశ్లీలత విషయం గురించి ఎక్కువగా విశదీకరించదు. మరోవిధంగా చెప్పాలంటే అశ్లీలతను నిర్వచించదు. అశ్లీలత అన్న భావన కమ్యూనిటీ ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని న్యాయపరమైన వ్యాఖ్యానాల మీద అశ్లీలత అనేది ఆధారపడి ఉంది. దాన్ని ప్రత్యేకంగా నిర్వచించకపోవడం వల్ల వ్యక్తిగత వ్యాఖ్యానాలకు, అభిప్రాయాలకు ఇది పరిమితమై పోయింది. నేరారోపణ అన్న అంశంమీద ఈ నిబంధన సైలెంట్‌గా ఉంది.
కోర్టు తీర్పులోని సారాంశం
మనదేశంలో కమ్యూనిటీకి సంబంధించి అనుసరించాల్సిన భావ వ్యక్తీకరణ ఏమిటంటే.. సామాజిక ప్రయోజనం, సమాజ లబ్ధి అనేది లేనప్పుడు వాక్ స్వాతంత్ర్యానికి, భావ వ్యక్తీకరణకి రాజ్యాంగ రక్షణ ఉండదు. దాన్ని అశ్లీలంగానే పరిగణిస్తుంది. మానవ స్వభావం సెక్స్‌తో ముడిపడి ఉంటుంది. సెక్స్ వైపు మనిషిని లాగడం అనేది నమ్రతకి, మర్యాదకు అవమానకరం. ఈ దృష్టితో చూసినప్పుడు లేడీ చాటర్లీ లవర్ నవలలో అశ్లీలత ఉంది. అందుకని హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ అప్పీలును డిస్మిస్ చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది.
అశ్లీలత అంటే..నేర ప్రవృత్తి, నేర ఉద్దేశం అన్న భావన
కోర్టు వ్యాఖ్యానికి వదిలివేయడమైంది. అశ్లీలతకు సంబంధించి న్యాయశాస్త్రాన్ని బ్రిటీష్ వాళ్ల దగ్గర నుంచి మన దేశం స్వీకరించింది. ‘హిక్లిన్ టెస్ట్’ అనేదాని నుంచి అశ్లీలతను నిర్వచించడం మొదలైంది. రెజినా వర్సెస్ హిక్లిన్ (1860) కేసులో ప్రధాన న్యాయమూర్తి కాక్బర్న్అశ్లీలత గురించి ఇలా అన్నారు. ‘అశ్లీలత అంశాలు ఎవరిని భ్రష్టు పట్టించాలో ఆ విధంగా భ్రష్టుపట్టిస్తే అది అశ్లీలత అనుకోవాల్సి వస్తుంది.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)