ఆస్తిలో వాటా కోసం..వేట కొడవలితో అక్కను నరికి చంపిన తమ్ముడు

ఆస్తిలో వాటా కోసం..వేట కొడవలితో అక్కను నరికి చంపిన తమ్ముడు
  • కారుతో ఢీకొట్టి, కొడవలితో నరికి లేడీ కానిస్టేబుల్ హత్య  
  • కులాంతర వివాహం చేసుకుందని,
  • ఆస్తిలో వాటా వదులుకునేందుకు ఒప్పుకోలేదని దారుణం
  • రంగారెడ్డి జిల్లా రాయపోల్​లో ఘటన
  • ఇది పరువు హత్యేనని బంధువుల ఆందోళన

ఇబ్రహీంపట్నం, వెలుగు:  డ్యూటీకి వెళ్తున్న లేడీ కానిస్టేబుల్ ను తోడబుట్టిన తమ్ముడే అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాయపోల్ ​గ్రామ సమీపంలో జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్​ గ్రామానికి చెందిన కొంగర నాగమణి (27) హైదరాబాద్​ శివారులోని హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్. ఆమె 2020లో ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి హాస్టల్​లోనే ఉంటున్నది. నాగమణి తల్లిదండ్రులు 12 ఏండ్ల కిందనే అనారోగ్యంతో చనిపోగా.. అక్క, తమ్ముడు పరమేశ్ (25 ) ఉన్నారు. అక్కకు పెండ్లి అయింది. 8 ఏండ్ల కింద నాగమణికి కూడా వివాహం జరగ్గా, 10 నెలల కింద విడాకులు తీసుకుంది. గత నెల 10న రాయపోల్ ​గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు బండారి శ్రీకాంత్ ను పెండ్లి చేసుకుంది.

 అయితే ఈ వివాహం నాగమణి కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇష్టం లేదు. దీంతో ఇటీవల గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తమకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకున్న నాగమణికి ఆస్తిలో వాటా ఇచ్చేది లేదని చెప్పారు. మొదటి పెండ్లి టైంలో నాగమణికి ఇచ్చిన ఎకరా భూమిని కూడా పరమేశ్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అది కాకుండా భవిష్యత్తులో కూడా తల్లిదండ్రుల ఆస్తిలో ఎలాంటి హక్కు లేదని ఓ బాండ్​పేపర్ రాసివ్వాలని డిమాండ్​ చేశాడు. అందుకు నాగమణి నిరాకరించింది. ఆ తర్వాత నాగమణి తన భర్త శ్రీకాంత్ తో కలిసి హయత్ నగర్ లో కాపురం పెట్టింది. అయితే కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా, బాండ్ పేపర్ రాసివ్వమంటే నిరాకరించిందని తమ్ముడు పరమేశ్​ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 

స్టేషన్ ఎదుట ఆందోళన.. 

కులాంతర వివాహమే ఈ హత్యకు కారణమని బంధువులు అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు సాగర్ రహదారిపై ఆందోళన చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నే నడిరోడ్డుపై కిరాతకంగా చంపితే సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఒంటిరిగా స్కూటీపై వెళ్తుండగా వేటు.. 

ఆదివారం రాయపోల్​కు వచ్చిన నాగమణి, శ్రీకాంత్ ను పరమేశ్​ గమనించాడు. సోమవారం ఉదయం స్కూటీపై ఒంటరిగా నాగమణి డ్యూటీకి వెళ్తుండగా కారులో వెంబడించాడు. రాయపోల్, మాన్యగూడ మధ్య వెనుక నుంచి అక్కను కారుతో ఢీకొట్టాడు. అదుపు తప్పి రోడ్డుపై పడిపోయిన నాగమణిని వేట కొడ వలితో నరికి చంపాడు. పరమేశ్​ వెంబడిస్తున్న టైంలో నాగమణి తన భర్త శ్రీకాంత్​కు ఫోన్​చేసింది. తన తమ్ముడు వెంబడిస్తున్నాడని తెలిపింది. శ్రీకాంత్​వెళ్లేలోపే నాగమణి చనిపోయి రోడ్డుపై పడి ఉంది. 

ఈ ఘటనతో ఒక్కసారిగా రాయపోల్  ఉలిక్కిపడింది. భర్త శ్రీకాంత్ ఫిర్యాదు తో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలంలో వేట కొడవలి, కారు బంపర్ తో సహా నంబర్ ప్లేట్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. నాగమణి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి పరిశీలించారు.