
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన లేడీ డాన్ జోయా ఖాన్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతోన్న జోయా ఖాన్‌ను నిషేదిత హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోయా ఖాన్ నుంచి దాదాపు కోటి రూపాయల విలువైన 270 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జోయా ఖాన్ అరెస్ట్‌తో ఆమె అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
బయటకు కనిపించకుండా తెర వెనక పెద్ద నేర సామ్రాజ్యాన్నే నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. భర్త జైల్లో ఉన్నప్పటికీ జోయా తన క్రైమ్ నెట్ వర్క్‌ను విస్తరించి దందా సాగించింది. జోయా నేర చరిత్ర చూసి పోలీసులే ఖంగుతిన్నారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు పోలీసులు జోయా ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు జోయా ఏ రేంజ్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిందో.
జోయా బేగం ఖాన్ ఎవరు?
ప్రముఖ రౌడీ షీటర్ హషీమ్ బాబాను 2017లో జోయా ఖాన్ పెళ్లి చేసుకుంది. అంతకుముందే ఆమె వేరొకరితో వివాహం జరగగా.. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి హషీమ్‌ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. భర్త హషీమ్ బాబా ఓ కేసులో జైలు పాలు కావడంతో అతడి నేర సామ్రాజ్యాన్ని జోయా ఖానే నడిపిస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ మాదిరిగానే జోయా తన భర్త నెట్ వర్క్‌తో దోపిడీ, మాదకద్రవ్యాల దందా సాగిస్తోంది. జోయా తరచుగా హై-ప్రొఫైల్ ఈవెంట్లకు హాజరవుతూ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తోంది. క్రమం తప్పుకుండా తీహార్ జైలులో హషీమ్‌ను కలుస్తూ ముఠా కార్యకలాపాల గురించి కోడింగ్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిఘా పెట్టి జోయా ఖాన్ ఆట కట్టించింది.
దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-1లో సెప్టెంబర్ 2024లో హత్యకు గురైన జిమ్ యజమాని నాదిర్ షా హత్యతో సంబంధం ఉన్న షూటర్లకు ఆశ్రయం కల్పించారనట్లు కూడా జోయాపై అభియోగాలు ఉన్నాయి. దీంతో జోయాపై స్పెషల్ సెల్ ప్రత్యేక దర్యాప్తు చేయగా.. జోయా నేర సంబంధాలు చాలా లోతుగా పాతుకుపోయాయినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కుటుంబానికి కూడా క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె తల్లి 2024లో లైంగిక అక్రమ రవాణా ముఠాలో పాల్గొన్నందుకు జైలు పాలైంది. అలాగే.. ఆమె తండ్రికి మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధాలు ఉన్నాయి.
ప్రధానంగా ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో క్రైమ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జోయా తరచుగా తన గ్యాంగ్‌స్టర్ భర్తకు విధేయులైన అనుచరులతో దందాలు సాగిస్తోంది. ఈ ప్రాంతం చెను, హషీమ్ బాబా, నాసిర్ పెహెల్వాన్ ముఠాల వంటి ముఠాలకు ప్రసిద్ధి చెందింది. 2007 నుంచి ముఠాల మధ్య అధిపత్య పోరుతో అనేక హింసాత్మక ఘర్షణలు, హత్యలు జరిగాయి. బాబా తరుఫున జోయా ముఠాను మొయింటైన్ చేస్తోంది. గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా బృందం దోపిడీలు చేయడంలో ఫేమస్. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్తోనూ హషీమ్ బాబా, అతడి భార్య జోయా ఖాన్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.