కాశీబుగ్గ: ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసి, ఆ వ్యక్తి అంత్యక్రియలు కూడా నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఓ మహిళా ఎస్సై. ఆమె మానవత్వాన్ని ప్రశంసిస్తూ పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న కాశిబుగ్గ ఎస్సై కొత్త శిరీష సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్థించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలో మీటర్ వరకు మోసుకు వెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు మృతదేహాన్ని అప్పగించడమేగాక.. దాని నిర్వాహకులు చిన్ని కృష్ణతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎస్సై కొత్త శిరీషను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవలను కొనియాడుతూ సెల్యూట్ మేడమ్ అంటూ ట్వీట్ చేశారు. ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని, ఇలాంటి పనులే చేయాలనే సమాజంలో… ఆమె ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారానికి, చేస్తున్న సేవకి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రాష్ట్రాలుగా వేరైనా.. పోలీస్ అనే వృత్తి రెండు రాష్ట్రాల పోలీసులను ఒక్కటి చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.
సెల్యూట్ మేడమ్!
ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని లేదా ఇలాంటి పనులే చేయాలి అనే సమాజంలో…
ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారనికి, చేస్తున్న సేవకి సగర్వంగా చేస్తున్నాం -సెల్యూట్. https://t.co/fNsAxoXQSA— Telangana State Police (@TelanganaCOPs) February 1, 2021