- గుండెనొప్పితో లగచర్ల నిందితుడి అస్వస్థత
- బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు
- వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలింపు
- సంగారెడ్డి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
హైదరాబాద్: కంది జైలులో ఉన్న లగచర్ల రైతుకు గుండెనొప్పి రావడంతో పరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీసులు. సదరు రైతు హీర్యానాయక్ ను బేడీలు వేసి మరీ జైలుకు తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
లగచర్లలో కలెక్టర్, కడా అధికారిపై జరిగిన దాడి కేసులో 45 మంది నిందితులు సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్నారు. వీరిలో హీర్యానాయక్ అనే రైతుకు నిన్న రాత్రి గుండెనొప్పి వచ్చింది. చికిత్స కోసం తీసుకొచ్చిన రైతును పోలీసు జీపులో.. చేతులకు బేడీలు, గొలుసులతో కట్టేసి మరీ తీసుకొచ్చారు. అదే గొలుసులతో ఆస్పత్రిలోపలికి నడిపించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సీఎం సీరియస్
లగచర్ల రైతుకు బేడీల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలను సహించేదిలేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.