- చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యుల పట్టు
- మాట్లాడే చాన్స్ ఇస్తామన్న స్పీకర్.. అయినా పట్టించుకోకుండా నినాదాలు
- వెల్‌లోకి వచ్చి..ప్లకార్డులతో నిరసన
- సభ నేటికి వాయిదా వేసిన స్పీకర్
- ప్లకార్డులు ప్రదర్శన..నేటికి వాయిదా వేసిన చైర్మన్
హైదరాబాద్, వెలుగు: లగచర్ల అంశంపై అసెంబ్లీలో రచ్చ జరిగింది. పర్యాటక శాఖపై షార్ట్ డిస్కషన్ జరగకుండా బీఆర్ఎస్ అడ్డుకున్నది. లగచర్ల రైతుల బేడీల అంశంపై చర్చించాలని ఆందోళన చేపట్టింది. సభ్యులు వెల్‌లోకి వచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని.. స్పీకర్ గడ్డం ప్రసాద్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో, సభను మంగళవారానికి వాయిదా వేశారు. దీంతో సభ బయట అసెంబ్లీ ఇన్నర్ గేటు ఎదుట బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.
అసెంబ్లీ ఇన్నర్ గేట్ వద్ద ధర్నా
సోమవారం సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ పర్యాటక శాఖపై షార్ట్ డిస్కషన్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో లగచర్ల అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. వెల్‌లోకి వచ్చి రైతుకు బేడీలు వేసిన ఫొటో ప్లకార్డులను ప్రదర్శించారు. స్పీకర్ పలుమార్లు వారిని కూర్చోవాలని కోరినా.. వినిపించుకోలేదు. దీంతో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని సభలో నినాదాలు చేయొద్దని, ప్లకార్డులు ప్రదర్శించొద్దని రూల్ ఉందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ లేవనెత్తే ప్రతి అంశంపై, సర్కారు జవాబు ఇస్తుందని పేర్కొన్నారు. సభా సమయం వృథా చేసేందుకు ఇలా చేయడం సరికాదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనే రూల్స్ బుక్ తయారు చేశారని, దాంట్లో 116 పేజీలో సభలో నినాదాలు చేయొద్దని, ప్లకార్డులు ప్రదర్శించొద్దని స్పష్టంగా ఉందని గుర్తుచేశారు.
టూరిజం పాలసీపై చర్చ జరిగేలా సహకరించాలని కోరారు. సభను, సభాపతిని గౌరవిస్తూ కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మరోసారి స్పీకర్ జోక్యం చేసుకొని.. సభ్యులు కూర్చుంటే అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ సమయంలోనే ప్లకార్డులు తీసుకోవాలని మార్షల్స్ కు ఆదేశించారు. రూల్స్ బుక్ ప్రకారం ప్లకార్డులు తేవొద్దని సభ్యులందరికీ తెలుసనీ, అయినా ఇలా తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని, కొత్త సభ్యులకు ఏం నేర్పిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ALSO READ : ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ సభా హక్కుల నోటీసు
సభ్యుల తీరు సభాసంప్రదాయాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. అయినా, బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు ఆపలేదు. పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిజంపై చర్చ ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు వెళ్లి అసెంబ్లీ ఇన్నర్గేట్వద్ద ధర్నా చేశారు.
అప్పుల కుప్ప.. చిప్ప చేతికిచ్చారు: మంత్రి జూపల్లి
పదేండ్లుగా బీఆర్ఎస్ చేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక పాలసీని తీసుకువచ్చి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని చూస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సభలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ గొప్పగా చేసినట్టు మాట్లాడుతున్నారని, వాళ్లకు ఏ అంశంపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పదేండ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితిని దిగజార్చి.. బంగారు పళ్లెంలో పెట్టి అధికారాన్ని అప్పగించామని బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతున్నారని, కానీ వాస్తవానికి అప్పుల కుప్ప, చిప్ప చేతికిచ్చారని విమర్శించారు. పర్యాటక పాలసీ తీసుకువచ్చి రాష్ట్ర ఆదాయం పెంచాలనే ఆలోచనతో షార్ట్ డిస్కషన్ పెడితే అడ్డగించడం సరికాదు అన్నారు.
మండలిలో లగచర్లపై చర్చకు బీఆర్ఎస్ పట్టు
హైదరాబాద్, వెలుగు: లగచర్ల రైతుకు బేడీలు వేసిన అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు మండలిలో డిమాండ్ చేశారు. జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో చైర్మన్ మండలిని మంగళవారానికి వాయిదా వేశారు. సోమవారం కౌన్సిల్లో టూరిజం పాలసీపై డిప్యూటీ సీఎం భట్టి స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. కాసేపటికే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. లగచర్ల అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. బీఏసీలోనూ ఈ అంశంపై చర్చ కోసం డిమాండ్ చేసినట్లు చెప్పారు. లగచర్ల అంశంపై ప్రభుత్వం స్పందిస్తుందని చైర్మన్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ ఆఫీసు ఎదుట ధర్నాకు చేశారు.