సురేశ్​ హైలెట్​ కానీకి మా ఊర్ని కంపుచేసిండు .. ఎమ్మెల్యే సబిత ముందు లగచర్ల గ్రామస్తులు

  • భూమిలేనోళ్లు వచ్చి దాడి చేసిన్రు

పరిగి, వెలుగు: వికారాబాద్​ కలెక్టర్​పై దాడి కేసులో రిమాండ్ అయి పరిగి జైలులో ఉన్న పలువురు లగచర్ల గ్రామస్తులను గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించడానికి రాగా, ఆమె ఊహించని సమాధానాలు వినాల్సి వచ్చింది. సబ్​జైలులో రిమాండ్ లో ఉన్న 16 మందిని పరామర్శించిన ఆమె.. వారితో పాటు వాళ్ల కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. ఏం జరిగిందని, ఊర్లో గొడవ ఎలా జరిగిందని అడగ్గా.. అక్కడున్న కుటుంబసభ్యుల్లో ఒకరు ఆమెకు సమాధానమిచ్చారు. ‘‘సురేశ్..కలెక్టర్ దగ్గరికి పోయి మా ఊరికి రమ్మన్నడు. 

సురేశ్​అవారా టైపు..పనీపాట లేకుంట ఉంటడు మేడమ్...అతడు చేసిన పనికి మేం బలిపశువులమైనం. హైదరాబాద్​లో ఉండే సురేశ్​అప్పుడప్పుడూ ఊరికి వచ్చిపోయేటోడు’’ అని ఆయన చెప్పాడు. సురేశ్ 41 సార్లు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడిండని చెప్పగా.. ఈ విషయం నీకెలా తెలుసని సబితారెడ్డి అతడిని ప్రశ్నించారు. దీనికి అతడు టీవీల్లో చూసినమని చెప్పాడు. ‘‘సురేశ్​హైలైట్ కావడానికే మా ఊరిని కంపు చేసిండు. పోయిన నెలల ఇంతకుముందే ఓసారి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని కొట్టిన్రు. 

మరి అట్ల జరిగినప్పుడు కలెక్టర్ ఊళ్లెకు వస్తున్నడంటే వంద మంది పోలీసులతో వచ్చేదుండే..కలెక్టర్ ఒక్కడే వచ్చేసరికి అంతా మీద పడ్డరు’’ అని తెలిపాడు. కలెక్టర్ పై దాడితో ఊరు ఊరంతా కంపైందని, సురేశ్ వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పాడు. దీంతో సబితారెడ్డికి ఏం చెప్పాలో తెలియక పక్కనే ఉన్న పిల్లాడిని ఎత్తుకొని టాపిక్​ను డైవర్ట్​ చేశారు. మరికొందరు మహిళలు మాట్లాడుతూ.. తమ కుటుంబసభ్యులు దాడి చేయకపోయినా జైలుకు వచ్చారని, దాడి చేసినవాళ్లలో అస్సలు భూమి లేనోళ్లు కూడా ఉన్నారని, వారంతా పరారయ్యారన్నారు. యాదయ్య అనే వ్యక్తికి ఎవ్వరూ లేరని, భూమి కూడా లేదని, అయినా బగ్గ తాగి కలెక్టర్ కారుపై బండతో కొట్టిండని చెప్పారు.