- కోస్గిలో మందు కొని లగచర్లకు తరలించిన సురేశ్
- స్థానికులను రెచ్చగొట్టి, దాడులకు దిగిన బీఆర్‌ఎస్ నేతలు
- కస్టడీలో కీలక వివరాలు వెల్లడించిన నిందితుడు
- ముగిసిన నరేందర్ రెడ్డి కస్టడీ.. కోర్టులో హాజరు
హైదరాబాద్, వెలుగు: లగచర్ల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి సహా భోగమోని సురేశ్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి ముందు 3 రోజుల పాటు లగచర్ల సహా పరిసర ప్రాంతాల్లో నిందితులు లిక్కర్ పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో పెద్ద మొత్తంలో మద్యం సేకరించినట్లు భావిస్తున్నారు.
ఈ మేరకు సురేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కోస్గి ఎక్సైజ్ పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సురేశ్ ను ఈనెల3, 4న కస్టడీలోకి తీసుకుని కీలక వివరాలను రాబట్టారు. ఆధారాలు ధ్వంసం చేసినందుకు బొంరాస్‌పేట పీఎస్‌లో సురేశ్ పై మరో కేసు నమోదు చేశారు. భూ సేకరణను అడ్డుకునేందుకు గ్రామస్థాయిలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది.
ఇందు కోసం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు తమకు అండగా ఉన్నారని సురేశ్ తెలిపినట్లు సమాచారం. పథకం ప్రకారమే కోస్గి నుంచి లిక్కర్ బాటిల్స్ తరలించినట్లు సురేశ్ విచారణలో వెల్లడైంది. భూ సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు గ్రామస్తులను ఎలా రెచ్చగొట్టారు? ఆర్థిక సహాయం ఎవరు అందించారనే వివరాలను పోలీసులు రాబట్టారు. దాడి అనంతరం పారిపోయేందుకు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నామని సురేశ్ వెల్లడించాడు. తన ఫోన్‌ను ధ్వంసం చేసి లారీలో పడేశానని పోలీసులకు అతను స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసినందుకు సురేశ్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు వెల్లడించిన సురేశ్?
పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించారని సురేశ్ వెల్లడించినట్లు తెలిసింది. కేసులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక వనరులను ఆ ఇద్దరు మాజీలే సమకూర్చినట్లు వివరించాడని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయా మాజీ మంత్రుల పేర్లతో పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. భూసేకరణను అడ్డుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తెలెత్తినా.. తమకు అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారని సురేశ్ వెల్లడించినట్లు తెలిసింది. ఈ మేరకు సురేశ్ తో కాంటాక్ట్‌లో ఉన్న స్థానిక బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గుర్తించారు. లిక్కర్ సప్లయ్ చేయడంతో పాటు దాడికి ప్రేరేపించిన మరో నలుగురి వివరాలను సేకరించారు. వారిని కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.
ఇద్దరినీ మరో 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
పట్నం నరేందర్ రెడ్డి రెండు రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. శని, ఆదివారం నిర్వహించిన కస్టడీ విచారణలో నరేందర్ రెడ్డి సహకరించలేదని తెలిసింది. సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ చెప్పకపోవడంతో పాటు దాడికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించలేదని సమాచారం. దీంతో సెల్‌ఫోన్‌ను ఓపెన్ చేయించేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును పోలీసులు కోరనున్నారు. ఈ క్రమంలోనే నిందితులిద్దరినీ మరో 7 రోజుల కస్టడీ కోరుతూ మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు.