- రైతుల బాధను కలెక్టర్‌కు చెప్పిండు తప్ప దాడి చేయలే
- నన్ను కూడా సురేశ్ కలుస్తుండె.. 50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నడు
- అట్ల కలిసినందుకు నాపైనా కేసు పెడ్తే పెట్టుకోవచ్చు
- పట్నం నరేందర్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన్రు.. ఆయనేమైనా బందిపోటా?
- భూసేకరణ పంచాయితీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలె
- మా టైమ్‌లో మల్లన్నసాగర్ రైతుల కడుపులో తలపెట్టి ఒప్పించినం
- ఐఏఎస్, ఐపీఎస్‌లు అతి చేస్తే ఏపీలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు సురేశ్ బరాబర్ బీఆర్ఎస్ కార్యకర్తేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్మా కంపెనీ కింద సొంత భూమి 7 ఎకరాలు పోతుందన్న బాధతో కడుపు మండి కొట్లాడిండని తెలిపారు. ‘‘సురేశ్ మా నాయకుడే. మా కార్యకర్తనే. తన భూమి పోతే సురేశ్ కొట్లాడడా? అడగొద్దా? నోరుమూస్కోని కూసోవాల్నా? తప్పా అది కూడా!” అని ప్రశ్నించారు.
తనను సురేశ్ ఎప్పుడూ కలుస్తుంటాడని, భూమి పోతుందన్న బాధను యాభై మంది రైతులతో వచ్చి చెప్పుకున్నాడని కేటీఆర్ వెల్లడించారు. ఓ పార్టీ కార్యకర్తగా సురేశ్ వచ్చి పట్నం నరేందర్ రెడ్డితో, తనతో మాట్లాడితే తప్పేందని ప్రశ్నించారు. ‘‘సురేశ్ నన్ను కలిసిండని నా మీద కూడా కేసు పెడ్తా అంటే పెట్టుకోండి. నేనెందుకు వద్దంట. పెట్టుకో” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌తో రైతుల బాధలను సురేశ్ వివరించాడని, ఎక్కడా కలెక్టర్‌పై సురేశ్ దాడి చేయలేదని అన్నారు. అసలు దాడి జరగలేదని కలెక్టరే స్వయంగా చెప్తుంటే.. ఐజీ మాత్రం జరిగిందంటున్నారని ఆయన తెలిపారు.
బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం తీసుకుంటున్న మూర్ఖ నిర్ణయాల వల్లే ప్రజలు తిరగబడుతున్నారని విమర్శించారు. ఫార్మా విలేజ్ అంశంపై ఆరు నెలల నుంచే కొడంగల్‌లో నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. కొడంగల్ రగలడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలేనని దుయ్యబట్టారు. ఇంటెలిజెన్స్ వైఫల్యంతోనే లగచర్ల ఘటన జరిగిందని, దాడి జరుగుతున్న సమయంలో అసలు సెక్యూరిటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే!
రేవంత్ రెడ్డి సొంత అల్లుడికి చెందిన మ్యాక్స్ బీఎన్ అనే సంస్థ కోసమే కొడంగల్‌లో రైతుల భూములను తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. సంస్థ ఏర్పడి నాలుగేండ్లు కాకముందే విస్తరణ పేరిట భూముల కోసం కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ‘‘మెడికవర్ హాస్పిటల్ ఓనర్ అయిన అన్నం శరత్ అనే వ్యక్తి కూడా రేవంత్‌కు క్లోజ్. శరత్ అల్లుడు, రేవంత్ రెడ్డి అల్లుడు ఒకే సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నరు. వాళ్లిద్దరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నడు. అన్నం శరత్ బెంగళూరులోనూ మెడికవర్ హాస్పిటల్‌ను ప్రారంభించిండు. ఆ కార్యక్రమానికి డీకే శివకుమార్ కూడా హాజరైండు. వరంగల్‌లో మెడికవర్ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండు” అని ఆయన పేర్కొన్నారు.
కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడ్తం
‘‘పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాలను ఎపిసోడ్లలాగా బయటపెడుతూనే ఉంటం. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్దందా చేస్తున్నరు. అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నరు” అని కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ నేతలందరం కలిసి కొడంగల్ వెళ్తామని, అక్కడి నుంచి రేవంత్ భరతం పడతామని అన్నారు. ‘‘తుగ్లక్ ప్రభుత్వం నిర్ణయం వల్ల అధికారులు బలవుతున్నరు. ఈ కుట్రలో అధికారులు బలి కావొద్దు. భూసేకరణ పంచాయితీ వచ్చినప్పుడు పిలిచి మాట్లాడని కుసంస్కార ప్రభుత్వం ఇది. మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టు నిర్మాణంలో రైతులను పిలిపించుకుని కేసీఆర్ మాట్లాడిండు. కానీ, రేవంత్ రెడ్డికి మాత్రం ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడే తీరిక లేకుండాపోయింది” అని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్ రెడ్డికి అసలు ‘ఈ –రేస్’ అంటే ఏంటో తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. 11 నెలల నుంచి రోజుకో కుంభకోణం పేరు చెప్పి టైంపాస్ చేస్తున్నారని, పాలన చేస్తలేరని విమర్శించారు. ఫార్ములా ఈ– రేస్ విషయంలో తనపై కేసు పెడితే పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా ప్రవర్తిస్తున్నారని, పట్నం నరేందర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కేసు ఏంటో చెప్పకుండా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. కాగా, నరేందర్ రెడ్డి అరెస్ట్ కావడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూములు ఇస్తేనే అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేస్తామంటూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను బెదిరిస్తున్నారని.. ఒక ఇంట్లో మహిళ ఛాతీపై కాలితో తొక్కి ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారని ఆరోపించారు. 144 సెక్షన్ ఉన్నా కూడా 300 మందితో తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలోకి ఎలా వెళ్తారని, పోలీసులు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.
నరేందర్ రెడ్డిని వారెంట్ లేకుండా ఎట్ల తీస్కపోతరు
సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం మహారాష్ట్రలో ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడి పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. తమ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, కిడ్నాప్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. పట్నం నరేందర్ రెడ్డి ఏమైనా బందిపోటా? అని ప్రశ్నించారు. వారెంట్ లేకుండానే.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే ఎలా తీసుకెళ్లిపోతారని అడిగారు. రైతులను అర్ధరాత్రి పూట వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, వారిని పోలీసులు టార్చర్ చేసి కొట్టారని ఆరోపించారు. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాల్సిందేనన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద తమకు నమ్మకం లేదని, రిపోర్ట్ మారుస్తారని, ప్రైవేటు నిపుణులతోనే రైతులకు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనలా లేదని, ఇది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నదని విమర్శించారు.