ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ లో పర్యటించక తప్పదని నివేదికలు చెబుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీ టోర్నమెంట్ డ్రాఫ్ట్ షెడ్యూల్ పంపింది. దీని ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పాకిస్థాన్ లోని లాహోర్‌లో జరగాల్సి ఉంది. నివేదికల ప్రకారం పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ను ఆమోదం కోసం ఐసీసీకు పంపగా.. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ లో భారత్ పర్యటించాలని ఐసీసీ ప్రతిపాదించింది.
భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే మ్యాచ్ ఆడేందుకు పాక్ వెళ్లే అవకాశం ఉన్నందున.. టీమిండియా పాక్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. బీసీసీఐ మాత్రం పాక్ లో పర్యటించేది లేదని తెగేసి చెప్తోంది.సరిహద్దు సమస్యలు ఓ కొలిక్కి వచ్చేవరకూ దాయాది దేశానికి వెళ్లేది లేదని ఖరాకండిగా చెప్తోంది. 2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది.
ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలో జరుగుతుంది. రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు వరుసగా కరాచీ, రావల్పిండిలో జరగనున్నాయి. మార్చి 9న జరగబోయే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాహోర్ ఆతిధ్యమిస్తుంది. పాక్ క్రికెట్ బోర్డు భారత్ ఆడే అన్ని మ్యాచ్ లకు లాహోర్‌ను వేదిక ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఒకవేళ భారత్ సెమీ ఫైనల్ కు వస్తే లాహోర్ లోనే ఆడే అవకాశం ఉంది. ఈ మైదానంలో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. రావల్పిండిలో ఐదు, కరాచీలో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.
మొత్తం 20 రోజుల్లో ఈ టోర్నీ జరిపేందుకు ఐసీసీ ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని రోజుల్లో ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి ఐపీఎల్ జరగనుంది కాబట్టి ఈ క్యాష్ లీగ్ కు ముందే ఈ టోర్నీ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రపంచ లీగ్ లు తమ షెడ్యూల్ ను సైతం మార్చున్నట్టు తెలుస్తోంది. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
India Vs Pakistan to be held in Lahore at the 2025 Champions Trophy. (Cricbuzz). pic.twitter.com/QqePc1jOoZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2024