- మహిళను కాల్చి చంపిన పోలీసులు
- ఆమె వెంట వచ్చిన పిల్లాడికి, మరో వ్యక్తికి గాయాలు
హ్యూస్టన్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆదివారం టెక్సాస్‌లోని చర్చిలో ఓ మహిళ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడి కాలుకి బులెట్ తగలగా.. సెక్యూరిటీ సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితురాలు చనిపోయింది. ఆమె వెంట వచ్చిన ఐదేండ్ల బాలుడికీ బులెట్ గాయాలయ్యాయని, అతని కండిషన్ సీరియస్‌గా ఉందని పోలీసులు తెలిపారు. ఆదివారం హ్యూస్టన్‌లోని జోయెల్ ఓస్టిన్ లాక్‌వుడ్ చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
రైఫిల్‌తో ఫైరింగ్, బాంబు ఉందంటూ కేకలు..
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లాక్‌వుడ్ చర్చికి వచ్చిన వందలాది మంది ప్రార్థనలు చేస్తున్నారు. దాదాపుగా 35 ఏండ్ల వయసున్న ఓ మహిళ ఐదేండ్ల బాలుడితో కలిసి లోపలికి వచ్చింది. ఆపై కాసేపటికే తాను వేసుకున్న పొడవాటి కోటు వెనక దాచిన రైఫిల్ తీసి ఫైరింగ్ మొదలు పెట్టింది. తన దగ్గర బాంబు ఉందని, పేల్చేస్తానని కేకలు వేసింది. దీంతో జనమంతా భయాందోళనతో బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అలర్ట్ అయిన చర్చి సెక్యూరిటీ సిబ్బంది.. ఆ మహిళపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఆమెతో పాటు వచ్చిన ఐదేండ్ల బాలుడికీ బులెట్లు తగిలాయని, ప్రస్తుతం అతడి కండిషన్ సీరియస్‌గా ఉందని హ్యూస్టన్ పోలీస్ చీఫ్ తెలిపారు. నిందితురాలితో వచ్చిన ఆ పిల్లాడు ఎవరు? ఆమె కాల్పులకు ఎందుకు తెగబడిందనేదానిపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఆమె చెప్పినట్లుగా బాంబు ఎక్కడా లభించలేదన్నారు. వెంటనే స్పందించి, ప్రాణనష్టాన్ని తగ్గించారని భద్రతా సిబ్బందిని హ్యూస్టన్ గవర్నర్ అభినందించారు.