- పన్ను రేట్ల తగ్గింపు ఫలితం.. వినియోగం బాగా పెరిగే అవకాశం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే వినియోగం బాగా పెరగాలి. ఖర్చులు చేయడానికి ప్రజల చేతుల్లో డబ్బులు మిగలాలి. ఈసారి బడ్జెట్ సరిగ్గా దీనిపైనే దృష్టి పెట్టింది. ఆదాయ పన్నులను భారీగా తగ్గించింది. దీనివల్ల కోటి మందికి పన్ను పోటు తప్పింది. ఫలితంగా జనం మరింత ఖర్చు చేసే అవకాశాలు పెరిగాయి. కొత్త బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ విధించలేదు.
అంతకంటే ఎక్కువ సంపాదించే వారికి కూడా పన్ను రాయితీలను పెంచడంతో ట్యాక్స్‌పేయర్లకు రూ.లక్ష కోట్లు ఆదా అవుతాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వసూలైన మొత్తం వ్యక్తిగత పన్ను ఆదాయంలో ఇది పది శాతానికి సమానం. మరో రకంగా చెప్పాలంటే 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కన్జూమర్లకు రూ.లక్ష కోట్లు ఇచ్చేసింది. ఈ అదనపు ఆదాయం రూ. 80 వేల వరకు ఉండవచ్చు.
అంతేగాక కొన్నింటిపై పరోక్ష పన్నులనూ కేంద్రం తగ్గించింది. ఉదాహరణకు మొబైల్‌ఫోన్ పరికరాల్లో కొన్నింటిపై కస్టమ్స్ డ్యూటీలను తగ్గించారు. దీనివల్ల ఫోన్ల అమ్మకాలు పెరగవచ్చు. ఖరీదైన ఫోన్లకు డిమాండ్ పెరగవచ్చు. ప్రజల అదనపు డబ్బు ఉండటం వల్ల సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు వంటి ఫాస్ట్ మూవబుల్కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు అధికమవుతాయి.
బడ్జెట్ ప్రవేశపెట్టాక హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు ఐదు శాతం వరకు పెరగడాన్ని గమనించవచ్చు. అంతేగాక ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు చేస్తే, అది ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రజల ఆదాయాన్ని పెంచుతుంది. దీని వలన ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈఎంఐల మొత్తం కూడా పెరుగుతుందని కంపెనీలు అంటున్నాయి. మిడిల్ క్లాస్ నుంచి కార్లకు డిమాండ్ పెరగవచ్చని చెబుతున్నాయి.
ప్రభుత్వానికీ మేలే..
పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్‌ను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ డబ్బు వల్ల ప్రైవేట్ కన్సంప్షన్ పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లపై ఎలాగూ జీఎస్టీ వసూలు చేస్తారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది. అంటే పన్ను ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ప్రభుత్వం రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీ లేకుండా రూ.1.5 లక్షల కోట్ల వరకు లోన్లు ఇస్తామని ప్రకటించింది. వీటికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం వాడుకోవచ్చు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వినియోగం వెంటనే పెరుగుతుంది.
ప్రైవేట్ కన్సంప్షన్ వల్ల మన జీడీపీకి 56–60 శాతం వరకు ఆదాయం వస్తోంది. ద్రవ్యోల్బణం వంటి కొన్ని సమస్యల వల్ల జనం గత కొన్ని నెలలుగా ఖర్చులను బాగా తగ్గించారు. అందుకే దీని పెంపు కోసం ఈసారి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పన్నులను తగ్గించడం వల్ల అన్ని రకాల వస్తువులకూ డిమాండ్పెరగవచ్చని గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ సీఎఫ్ఓ ఆసిఫ్ మల్బరీ అన్నారు.