ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

లఖింపూర్ ఖేరీ ఘటనలో ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దుపై దాఖలైన పిటిషన్‌ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టనుంది. గంలో లఖీంపూర్ ఖేరీ ఘటనపై విచారణ చేపట్టిన బెంచ్‌‌నే రేపు కూడా ఈ కేసు కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

మరోవైపు ఆశిష్ మిశ్రా బెయిల్‌ రద్దు చేయాలంటూ న్యాయవాదులు శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడు బెయిల్పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. కేసు విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెంటనే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సిట్ కేసును బలంగా ప్రెజెంట్ చేయనందునే అలహాబాద్ కోర్టు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిందని అడ్వొకేట్ శివ కుమార్ ఆరోపించారు. కేసులో ప్రధాన నిందితుడు దర్జాగా బయట తిరుగుతుండగా.. బాధిత కుటుంబాలు భయంతో బతుకుతున్నాయని అన్నారు. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో గత ఏడాది అక్టోబర్ 3న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్న రైతులపై కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులతోసహా 8 మంది మరణించారు. ఈ కేసులో అరెస్టయి నాలుగు నెలలు కస్టడీలో ఉన్న ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టుకు చెందిన సింగిల్ బెంచ్ ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు చట్టపరంగా సమర్థనీయం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేనికీ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని కూడా చెప్పారు పిటిషనర్లు.