- రోడ్లమీద పారుతున్న అమ్మవారిని అభిషేకం చేసిన పాలు, పంచామృతాలు
- ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో సమస్య లు
- ప్రైవేట్ వ్యక్తులు, కొందరు అర్చకుల తీరుపై విమర్శలు
- అరకొర సౌకర్యాలు, గంటల తరబడి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులు
వరంగల్, వెలుగు: తెలంగాణ ఇంద్రకిలాద్రిగా పిలిచే ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలొస్తున్నారు. కానీ, అరకొర సౌకర్యాలు, ప్రైవేటు వ్యక్తుల పెత్తనం, కొందరు అర్చకుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా సందర్భంగా ఈ నెల 3 నుంచి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. రెండు తెలు గు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
రద్దీ మేరకు ఆల యంలో అధికారులు కావాల్సిన చర్యలు తీసుకోలేదని భక్తులు అంటున్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినప్పడు ఒకేసారి పంపడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి సమయం తీసుకుంటుండగా, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై భక్తులు సీరియస్ అవుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే అమ్మవారిని అభిషేకం చేసిన పాలు, పంచమృతాలు భక్తులు నడిచే దారిలో కాళ్లు తడిచేలా ప్రవహిస్తున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అధికారులు, ఏర్పాట్ల విషయంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ఆదాయానికి గండి.. అధికారుల తీరుపై విమర్శలు
అమ్మవారి ఆలయంలో నిర్వహణ అధికారుల చేతుల్లో కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారులు, సిబ్బంది చూసుకోవాల్సిన బాధ్యతలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి కొందరు ఆలయం ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ సిబ్బంది ద్వారా విక్రయించాల్సిన అభిషేకం టిక్కెట్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటున్నాయి. దానికి సంబంధించిన డబ్బులు వారివద్దే ఉంటున్నాయి.
ఈ ఆదాయానికి ఎవరూ బాధ్యత వహిస్తారో తెలియడంలేదు. కొందరు అర్చకులు తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉండేవారికి ఎదురొచ్చిమరీ క్షణాల్లో దర్శనాలు చేపిస్తున్నారు. పట్టువస్త్రాలతో సన్మానాలు చేస్తున్నారు. ఇంకొందరు తమ మనుషుల ద్వారా స్పెషల్ దర్శనాలు చేపించడంపై గంటల తరబడి క్యూలో ఎదురుచూసే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.