మహాకుంభ మేళా..మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు..10 కోట్ల మంది వచ్చే చాన్స్

మహాకుంభ మేళా..మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు..10 కోట్ల మంది వచ్చే చాన్స్
  • మహాకుంభ మేళాకు ఆ రోజు 10 కోట్ల మంది వచ్చే చాన్స్
  • 29వ తేదీన నో వీఐపీ ట్రీట్​మెంట్

మహాకుంభ్​నగర్: ప్రయాగ్​రాజ్​లో మహాకుంభ మేళాకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేళాకు రానున్నారు. 

ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ రోజు వీఐపీలకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని అధికారులు స్పష్టంచేశారు. సాధారణ భక్తులతో పాటు పుణ్య స్నానాలు ఆచరించాల్సి ఉంటుందని తెలిపారు. 

మౌని అమావాస్య రోజు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. 

ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, వెహికల్ పార్కింగ్, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, ప్రత్యేక పూజలు వంటి చోట్ల తొక్కిసలాటకు ఆస్కారం ఇవ్వొద్దని అన్నారు. 

12 కిలో మీటర్ల ఘాట్లపై సౌలత్​లు

ఏ సెక్టార్ లేదా జోన్ నుంచి భక్తుడు వచ్చాడో.. అదే రూట్​లో తిరిగి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు. 27 నుంచి 29వ తేదీ వరకు 12 కిలో మీటర్ల మేర ఘాట్​పై వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. అదేవిధంగా ప్రయాగ్​రాజ్​లోకి కూడా వెహికల్స్​కు ఎంట్రీ ఉండదు. భక్తులంతా తమ ఎంట్రీ పాయింట్లకు దగ్గరగా ఉన్న ఘాట్ల వద్దే స్నానాలు ఆచరించి తిరిగి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు సూచించారు.

12 రోజుల్లో.. 12 కోట్ల మంది భక్తుల స్నానాలు

12 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న ఘాట్లపై రివర్ బారికేడింగ్, వాటర్ పోలీస్, వాచ్ టవర్లు, లైటింగ్, టాయిలెట్లు, డ్రెస్ చేంజింగ్ రూమ్​లు ఏర్పాటు చేస్తున్నారు. గడిచిన 12 రోజుల్లో సుమారు 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా, కుంభమేళాలో ఆయూష్ కేంద్రాల ద్వారా 1.21 లక్షల మంది భక్తులు లబ్ధి పొందినట్లు ఆయూష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ప్రతి రోజూ వాటర్ టెస్టింగ్

త్రివేణి సంగమంలోని నీటిని ప్రతి రోజూ అధికారులు టెస్ట్ చేస్తున్నారు. భక్తులు వదిలిన పూజా సామగ్రి, ఇతర చెత్తను తొలగిస్తున్నారు. 200 కిలో మీటర్ల పొడవైన డ్రైనేజీ సిస్టమ్​ను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

ప్రతి రోజు 1.60 కోట్ల లీటర్ల వ్యర్థాలను తొలగిస్తున్నారు. స్నానం చేసేందుకు త్రివేణి సంగమంలోని నీళ్లు బాగున్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. నీటి వ్యర్థాలు, మలమూత్రాలను ఇస్రో, బార్క్ రూపొందించిన స్పెషల్ టెక్నాలజీతో క్లీన్ చేస్తున్నారు.