సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు

సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు
  • మన్ననూరు ఫారెస్ట్‌‌ చెక్‌‌పోస్ట్‌‌ నుంచి నిలిచిపోయిన వాహనాలు

నాగర్‌‌కర్నూల్‌‌/అచ్చంపేట/లింగాల, వెలుగు : నల్లమల అడవి శనివారం భక్తులతో కిటకిటలాడింది. దట్టమైన అడవిలో ఏడాదికోసారి జరిగే సలేశ్వరం జాతరకు, అక్కడ కొలువైన లింగమయ్యను దర్శించుకునేందుకు శనివారం లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి, గోర్జ గుండాల మీదుగా కొందరు, అమ్రాబాద్‌‌ మండలంలోని మన్ననూర్‌‌, పర్హాబాద్‌‌ చౌరస్తా, రాంపూర్‌‌పెంట మీదుగా మరికొందరు సలేశ్వరం చేరుకున్నారు.

ఇప్పటికే నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకోగా, మరో మూడు లక్షల మంది రానున్నట్లు తెలుస్తోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై హాజీపూర్‌‌ చౌరస్తా నుంచి ఫర్హాబాద్‌‌ వరకు సుమారు 36 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఫర్హాబాద్‌‌ నుంచి వచ్చే వాహనాలకు రాంపూర్‌‌ పెంట వద్ద పార్కింగ్‌‌ స్థలం కేటాయించారు. కానీ, ఉదయం10 గంటల వరకే ఆ స్థలం నిండిపోవడంతో తర్వాత వచ్చిన వారు తమ వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్‌‌ చేస్తుండడం ఇబ్బందిగా మారుతోంది.