- ఏడాది కాలంగా ఈహెచ్ఎస్, జీపీఎఫ్ పెండింగ్
- 4 డీఏలు పెండింగ్ తొలిసారి అంటున్న ఉద్యోగులు
- జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాల మీద తీవ్ర ఒత్తిడి
- చర్చలకు పిలవని కేబినెట్ సబ్ కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని లక్షల మంది ఉద్యోగులు నారాజ్ లో ఉన్నారు. కింది స్థాయి ఉద్యోగి నుంచి గెజిటెడ్ స్థాయి ఉద్యోగుల వరకు సమస్యలు పరిష్కారం కాక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఈహెచ్ఎస్, పెండింగ్ మెడికల్ బిల్లులు, 4 పెండింగ్ డీఏలు, 317 జీవో, సీపీఎస్ రద్దు, పీఆర్సీ రిపోర్ట్, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్ మెంట్, క్యాడర్ స్ర్టెంత్ మంజూరు, కారుణ్య నియమకాలు వంటివి ఉన్నాయి.
సమస్యలు పరిష్కరించాలని జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతున్నదని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఇదే విషయాన్ని పలువురు మంత్రులకు, ఉన్నతాధికారులకు కలిసిన ప్రతిసారి చెబుతున్నామని నేతలు గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో నిధుల కొరత సమస్య ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సుమారు రూ.20 వేల కోట్లు ఈ స్కీమ్ కే ఖర్చుచేయడంతో ఇతర స్కీములు, ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉంచారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈహెచ్ఎస్ ముందుకు పడట్లే
రాష్ర్ట ఆవిర్భావం నుంచి ఉద్యోగులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఈహెచ్ఎస్. ఆరోగ్య శ్రీ స్కీం లో ప్రైవేట్ హాస్పిటల్స్ కు రూ.600 కోట్లకు పైనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి ఉండటంతో ఉద్యోగుల ట్రీట్ మెంట్ కు ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ నిరాకరించాయి. దీంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులు పెట్టి చికిత్స తీసుకున్నారు. కరోనా టైమ్ లో ఉద్యోగులు లక్షల్లో ఖర్చుచేసి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఈ బిల్లుల రీయింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వానికి అప్లై చేస్తే ఎంత ఖర్చు పెట్టుకున్నా రూ.2 లక్షల లోపేఇస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ స్కీమ్ కి బదులు ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటుచేసి ఉద్యోగుల నుంచి కొంత అమౌంట్, ప్రభుత్వం నుంచి కొంత జమచేసి ఆ నిధుల ద్వారా ఈహెచ్ఎస్ ను అమలుచేయాలని ఉద్యోగులు సూచించారు.
తమ బేసిక్ పే నుంచి 1 శాతం అమౌంట్ ఇస్తామని అంగీకరించి ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు గత ప్రభుత్వంలోనే అంగీకార పత్రం ఇచ్చారు. అయినా ఇంత వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సీపీఎస్ రద్దు అయిందని, ఇక్కడ కూడా రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్ మెంట్ చేయడానికి మూడేండ్ల టైమ్ పడుతున్నదని, దీంతో పిల్లల పెండిండ్లు, హెల్త్ సమస్యలు, ఇండ్ల నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు తెలిపారు. 4 డీఏలు పెండింగ్ లో ఉండటం చరిత్రలో తొలిసారని చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాలు ఏర్పడి 8 ఏండ్లు అవుతున్నా ఇంత వరకు క్యాడర్ స్ర్టెంత్ మంజూరు చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. పీఆర్సీ సైతం లేట్ గా ఇస్తుండడంతో ప్రతి ఉద్యోగి లక్షల రుపాయలు కోల్పోయారని చెప్పారు.
కేబినెట్ సబ్ కమిటీ చర్చలు ఎప్పుడు?
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, టీచర్లు మొత్తం 204 సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణను ఈ ఏడాది అక్టోబరులో జేఏసీ ప్రకటించింది. దీంతో సీఎం రేవంత్ జేఏసీతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్ గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ కేకేలను మెంబర్లుగా నియమించారు. దీపావళి తరువాత చర్చలకు పిలిచి శాఖల వారీగా సమస్యలపై చర్చిస్తామని సబ్ కమిటీ చైర్మన్ భట్టి హామీ ఇచ్చారు. సంక్రాంతి వస్తున్నా ఇంత వరకు చర్చలకు పిలవలేదని, వెంటనే చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్థికభారం లేని సమస్యలను పరిష్కరించండి
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇంత వరకు చర్చలకు పిలవలేదు. త్వరగా చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నం. జిల్లాల్లో ఉద్యోగుల నుంచి జేఏసీ మీద ఎంతో ఒత్తిడి ఉంది. ఉద్యోగుల పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్, పెండింగ్ డీఏలు మా ప్రధాన అంశాలు. ఇవి డిమాండ్లు కాదు. రుణమాఫీ చేస్తున్నరు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నరు. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నాం.-ఏలూరి శ్రీనివాసరావు, ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్