- మాటలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
- కట్టిన కాసిన్ని పంపిణీ చేస్తలే.. కొత్త వాటికి పర్మిషన్లు ఇస్తలే
- జాగలు ఉన్నోళ్లకు సాయంపై రెండేండ్లుగా ప్రకటనలతోనే సరి
- 2021లో రూ.5 లక్షలు ఇస్తమని.. తర్వాత రూ.3 లక్షలకు కుదింపు
- ఎన్నికల వేళ ఈసారి అమలు చేసినా.. ఎమ్మెల్యే చెప్పినోళ్లకే పైసలు
- రూ.లక్ష చొప్పున మూడు విడతల్లో పంపిణీ చేయాలని ప్లాన్
హైదరాబాద్, వెలుగు: నిలువ నీడ లేక గోస పడుతున్న లక్షలాది కుటుంబాలకు ఇండ్ల కోసం ఏండ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామంటూ తొమ్మిదేండ్ల కిందట రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమయ్యాయి. కట్టిన కాసిన్ని ఇండ్లను కూడా పంపిణీ చేయడం లేదు.. కొత్తగా నిర్మాణానికి పర్మిషన్లు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో దాదాపు 35 లక్షల కుటుంబాలు ఇండ్లు లేక ఇక్కట్లు పడుతున్నాయి. ఇంకోవైపు ఖాళీ జాగా ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఇండ్లు కట్టుకోలేని వారికి సాయం చేస్తామని చెప్పి సర్కారు రెండేండ్లుగా ఊరిస్తూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపో మాపో ఈ స్కీమ్‌ను ప్రారంభించినా.. ఎమ్మెల్యే చెప్పినోళ్లకే సాయం అందేలా మార్గదర్శకాలు తయారు చేస్తున్నారు. అది కూడా 3 విడతల్లో లక్ష చొప్పున ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. సాయంపై సాగదీత సొంత జాగ ఉన్న వాళ్లు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చేసే ఆర్థిక సాయంపై ఇంకా గైడ్ లైన్స్ అధికారికంగా ప్రకటించలేదు.
2021 నుంచి ఈ స్కీమ్ అమలును అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర సర్కార్ ఊరిస్తున్నది. 2020–21లో సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. స్కీమ్‌ను ఆ ఏడాది అమలు చేయలేదు. తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు తగ్గించారు. గతేడాది కూడా అమలు కాలేదు. మొన్నటి 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనూ ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 4 లక్షల మందికి ఇస్తామని, అదీ కూడా ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేస్తారని పేర్కొన్నారు. మొత్తం రూ.12 వేల కోట్లను ఇందుకోసం బడ్జెట్లో కేటాయింపులు చేశారు.
ఇప్పుడేమో ఒక్కసారి కాదు మూడు విడతల్లో రూ.లక్ష చొప్పున సాయం ఇస్తామని చెబుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా దశల వారీగానే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే ఇల్లు కట్టుకుని ఉందామనుకున్న పేద కుటుంబాలు.. అసలు ఇస్తారా ఇవ్వరా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఏదో తూతూమంత్రంగా రూ.లక్ష ఇచ్చి స్కీమ్‌ను పక్కన పడేస్తారని అంటున్నారు. పైగా ఫుడ్ సెక్యురిటీ కార్డు, 58, 59 జీవోల కింద లబ్ధి పొంది ఉండకూడదు. ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుని.. అందులో నుంచి ఎమ్మెల్యే ఎవరికి చెబితే వాళ్లకే ఇచ్చేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. మిగిలిన వారికి ఎన్నికల తర్వాత అందుతుందని ప్రచారం చేసుకునే ప్లాన్ చేశారు.
‘డబుల్’ ఆశలు గల్లంతు
డబుల్ బెడ్రూం ఇండ్లపై పేదలు ఎన్నో ఆశ లు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటి వరకు కట్టిన వాటినే పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. సర్కార్ ఇక డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వబోదని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త డబుల్ ఇండ్లకు మంజూరు ఇవ్వడం లేదని తెలిసింది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇండ్లు లేని నిరుపేదలకు డబు ల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దాదాపు 27 లక్షల కుటుంబా లకు 2018 ఎన్నికల లోపే డబుల్ ఇండ్లు కట్టించి ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ అంచనాల ప్రకారం 35 లక్షల కుటుంబా లకు సొంత ఇండ్లు లేవు. క్షేత్రస్థాయిలో ఈ సంఖ్య ఇంకింత పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.92 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇం దులో 1.42 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చే శారు. ఇంకో 50 వేల ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా మొదలు కాకుండా 63,528 ఇండ్లున్నాయి. కట్టించి న వాటిలో ఇప్పటి వరకు పంపిణీ చేసినవి 30 వేల లోపే. జీహెచ్ఎంసీలో ఇండ్ల పంపి ణీకి సంబంధించి ఏప్రిల్ 30న కొత్త సచివా లయంలో మంత్రి కేటీఆర్ ఫైల్‌పై తొలి సంత కం చేశారు. ఆ తర్వాత 300 డబుల్ ఇండ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు.
ఆవాస్ యోజన అమలు చేస్తలే
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఈ స్కీమ్ లో భాగంగా రూరల్ ఏరియాల్లో ఒక ఇంటి నిర్మాణానికి రూ.72 వేలు, అర్బన్ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది. అయితే డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రభుత్వం ఆ నిధులను డైవర్ట్ చేసింది. డబుల్ ఇండ్లను కూడా అనుకున్నన్ని నిర్మించి ఇవ్వలేదు. దీంతో లక్షలాది మందికి అందాల్సిన స్కీమ్.. అసలు ఎవరికీ కాకుండా పోతున్నది. ఏపీలో ఏకంగా 20 లక్షల ఇండ్లు పీఎం ఆవాస్ యోజన కింద మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద మన రాష్ట్రానికి రూ.1,311 కోట్లను కేంద్రం ఇచ్చింది. లబ్ధిదారుల వివరాలు కేంద్రానికి పంపితే మరో రూ.1,300 కోట్లు వస్తాయి. కానీ ప్రభుత్వం వివరాలేమీ పంపడం లేదు. పైగా ఇప్పుడు ఖాళీ జాగాల్లో విడతల వారీగా అందించే ఆర్థిక సాయం కూడా సగం కేంద్ర నిధుల నుంచే సర్దుబాటు చేయనున్నట్లు తెలిసింది.
ఉన్న భూములను అమ్మేస్తున్నరు
రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న ఖాళీ ల్యాండ్స్‌ను ఇంటి స్థలం లేని పేదలకు పంచి పెట్టే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం వాటిని అమ్ముకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఆ రెండూ అడ్రస్ లేకుండా పోయాయి. గృహ నిర్మాణ శాఖను తీసేసి.. ఆర్ అండ్‌బీలో కలిపేశారు. పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఉద్దేశించిన రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు మూతపడ్డాయి. వాటి భూములను ప్రభుత్వం తీసేసుకుని సేల్ చేస్తూ వస్తున్నది. ఇండ్లు లేని పేదలకు ఆయా స్థలాలను పంపిణీ చేయాల్సింది పోయి.. వాటిని అమ్మడం ద్వారా వచ్చే సొమ్ముతో ఖజానా నింపుకుంటున్నదన్న విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్, దాని శివారు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో 19 చోట్ల ఉన్న 820 ఎకరాలు రాజీవ్ స్వగృహ కింద ఉన్నాయి. హైదరాబాద్పరిసరాల్లో రాజీవ్ స్వగృహకు 632.22 ఎకరాలుంది. మహబూబ్‌నగర్, వికారాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్జిల్లాల్లో 187.93 ఎకరాలుంది. ఇక హౌసింగ్ బోర్డు పరిధిలో లిటిగేషన్ లేని భూములు 386.2 ఎకరాలు ఉన్నాయి. వీటిన్నింటినీ ప్రభుత్వం అమ్ముతున్నది. మరోవైపు సోషల్ వెల్ఫేర్ భూములు కొన్నింటిని 75 గజాల చొప్పున పంపిణీ చేస్తామని సర్కారు చెబుతున్న మాటల్లో ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.