లక్ష్మీనారసింహుడికి లక్షపుష్పార్చన

 లక్ష్మీనారసింహుడికి లక్షపుష్పార్చన

యాదగిరిగుట్ట, వెలుగు : ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం లక్ష్మీనారసింహులకు లక్షపుష్పార్చన పూజను అర్చకులు వైభవంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలతో స్వామి, అమ్మవార్లను అందంగా అలంకరించి.. ప్రధానాలయ ముఖ మంటపంలో స్వర్ణవేదికపై అధిష్టింపజేసి లక్షపుష్పార్చన కైంకర్యాన్ని నయనానందకరంగా చేపట్టారు. 

కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మంగళవారం ఆలయానికి రూ.22,79,976 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.