లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ విమర్శించారు.
2024, జూలై 1వ తేదీ సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా తన తొలి ప్రసంగంలో రాహుల్ గాంధీ.. బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకులు హిందువులు కాదని.. ఎందుకంటే వారు హింసను ప్రేరేపిస్తున్నారని.. ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. లోక్ సభలో రాజ్యాంగ ప్రతులు, శివుడు, మహ్మద్ ప్రవక్త, జీసస్ , గురునానక్ ఫోటోలను చూపిస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
హిందూ మతం పేరు చెప్పి బీజేపీ.. అందరినీ భయపెడుతుందని ఫైరయ్యారు. దీంతో సభ రసాభాసగా కొనసాగింది. రాహుల్ వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. రాహుల్ హిందూ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత లక్ష్మణ్ సింగ్ అభ్యంతరం తెలిపారు.
లక్ష్మణ్ సింగ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. "పార్లమెంటులో హిందువుల గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమైనవి, అనవసరమైనవి. ప్రజలు, దేశానికి సంబంధించిన సమస్యలను మాత్రమే లేవనెత్తడం సముచితం" అని అభిప్రాయపడ్డారు.