సర్పంచ్​ వేధింపులతో మహిళ మృతి

చిన్నశంకరంపేట, వెలుగు :  మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటకు చెందిన ఓ మహిళ గుండెపోటుతో చనిపోగా, ఆమె మృతికి మండల కేంద్ర సర్పంచే కారణమని కుటుంబ సభ్యులు రెడ్డెక్కారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అంబాజీపేటకు చెందిన డోకి లక్ష్మి(52)కి గ్రామ శివారులోని సర్వే నంబర్67లో 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దానిపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. సదరు భూమి విషయంలో చిన్నశంకరంపేట సర్పంచ్ ​రాజిరెడ్డి తనను వేధిస్తున్నట్లు లక్ష్మి వివరించిన వీడియో ఒకటి ఇటీవల స్థానిక వాట్సాప్​ గ్రూపుల్లో బాగా వైరల్​అయింది.

ALSO READ: ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు మృతి

అయితే ఏమైందో ఏమో బుధవారం ఉదయం 9 గంటలకు లక్ష్మి గుండెపోటుతో కుప్పకూలింది. కుటుంబ సభ్యులు హాస్పిటల్​కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న అంబాజీపేట గ్రామస్తులు, బంధువులు స్థానిక మెదక్​ – చేగుంట హైవేపై ఆందోళనకు దిగారు. సర్పంచ్ రాజిరెడ్డి పొలం లక్ష్మికి చెందిన పొలం వివాదంలో తలదూర్చి బెదిరింపులకు దిగడంతో ఆమె ఆందోళనకు గురై చనిపోయిందని ఆరోపించారు. తనకు అన్యాయం చేయొద్దని పలు మార్లు వేడుకున్నా వదిలిపెట్టలేదని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో కొనసాగడంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

మృతురాలి కొడుకు ప్రభాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి హాస్పిటల్​కు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్థిక సాయం చేశారు. చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి వేధించడంతోనే లక్ష్మి మానసిక క్షోభకు గురై చనిపోయిందని మండల బీఆర్ఎస్​ అధ్యక్షుడు పట్లోరి రాజు ఆరోపించారు. ఇటీవల లక్ష్మి మాట్లాడిన వీడియో వైరల్​అయిన సంగతి గుర్తుచేశారు. మహిళ మృతికి కారణమైన వారిని విడిచిపెట్టబోమన్నారు.