కనుల పండువగా నారసింహుడి ధ్వజారోహణం

యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, భేరిపూజ, దేవతాహ్వానం, హవనం వంటి ఉత్సవాలను నిర్వహించారు. ధ్వజారోహణంలో భాగంగా గరుడాళ్వారుల ప్రతిమను తెల్లని వస్త్రంపై చిత్రించి, ప్రధానాలయ ముఖ మండపంలో గర్భాలయానికి అభిముఖంగా ఉన్న బంగారు ధ్వజస్తంభానికి అలంకరించారు. 

అనంతరం గరుడ ముద్దలను గాలిలోకి ఎగురవేస్తూ నరసింహుడి కల్యాణానికి గరుత్మంతుడి ద్వారా సకల దేవతలకు ఆహ్వానాన్ని పంపే ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం ద్వారా.. బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి వచ్చిన సకల దేవతలకు స్వాగతం పలికే కైంకర్యాన్ని నిర్వహించారు.  

అంతకుముందు స్వామివారిని ప్రత్యేక అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మూడో రోజైన బుధవారం మత్స్యావతార అలంకార సేవ, శేషవాహన సేవ నిర్వహించనున్నారు. ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, టెంపుల్ చైర్మన్ నర్సింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రఘు, సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.