పాతగుట్టలో వైభవంగా ధ్వజారోహణం

పాతగుట్టలో వైభవంగా ధ్వజారోహణం
  • నేడు లక్ష్మీనారసింహుడి ఎదుర్కోలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం, హోమం, వేదపారాయణాలు నిర్వహించారు.

ధ్వజారోహణంలో భాగంగా గరుడాళ్వారుల ప్రతిమను తెల్లని వస్త్రంపై చిత్రించి ధ్వజస్తంభానికి అలంకరించారు. అనంతరం గరుడ ముద్దలను గాలిలోకి ఎగురవేస్తూ నారసింహుడి కల్యాణానికి గరుత్మంతుడి ద్వారా సకల దేవతలకు ఆహ్వానం పంపారు. సాయంత్రం భేరిపూజ, దేవతాహ్వానం జరిపారు. అంతకుముందు స్వామివారిని ప్రత్యేక అలంకారంలో ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, ఏఈవో జూశెట్టి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సింహవాహన అలంకార సేవలో ఆలయ తిరువీధుల్లో విహరింపజేస్తారు. సాయంత్రం ఆశ్వవాహనంపై ఆలయ మాఢవీధుల్లో ఊరేగించి, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం జరపనున్నారు.