యాదగిరిగుట్ట, వెలుగు: ఓమన్ దేశ రాజధాని మస్కట్ లో శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు సమక్షంలోని అర్చక బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహాచార్యులు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మస్కట్ లో స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసం చివరి శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. శుక్రవారం ఒక్కరోజే 1,137 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రత పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ చేపట్టి ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధుల్లో విహరింపజేశారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శుక్రవారం ఆలయానికి రూ.39,79,146 ఆదాయం సమకూరింది.
పెండింగ్ పనులు పూర్తి చేయండి
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను తొందరగా కంప్లీట్ చేయాలని సంబంధిత ఆఫీసర్లను సీఎంవో స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్టలో శుక్రవారం పనుల పురోగతిపై వైటీడీఏ ఆఫీసర్లతో ఆయన రివ్యూ నిర్వహించారు. గ్రీనరీ, కమాండ్ కంట్రోల్ రూం, దుకాణాల నిర్మాణం, ల్యాండ్ స్కేప్, డ్రిప్, అన్నదాన సత్రం బిల్డింగ్ పనులపై ఆఫీసర్లు, కాంట్రాక్టర్లతో చర్చించారు. ట్రాఫిక్ నియంత్రణపై డీసీపీ నారాయణ రెడ్డితో డిస్కస్ చేశారు. పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, పనులను మరింత వేగంగా చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.